పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎల్లమంద ఒకప్రశ్నకూ జవాబుచెప్పలేదు. ఊరికే చిరునవ్వు! నవ్వులోనే అన్నివేల కోట్ల ప్రశ్నలకు జవాబు! అతడు అన్నిటికీ జవాబు చెప్పినట్లే అందరికీ తోచింది.

ఒక బాలుడు సోడా తీసుకు వచ్చాడు.

ఇంకో బాలుడు నిమ్మకాయ పట్టుకు వచ్చాడు.

మరొక బాలుడు తన జేబులో ఉపయోగించకుండా దాచుకొని ఉన్న జేబురుమాలు పెట్టి స్వయంగా ఎల్లమంద మొగం తుడిచాడు.

ఇంతలో రిఫరీ ఈల వేశాడు.

గబగబ జనం ఆటస్థలం వదిలారు. ఈ పక్క జట్టు ఆ పక్కకు ఆ పక్క జట్టు ఈ పక్కకు మారినారు.

సీనియర్ జట్టువారు బాగా ఆలోచించుకుని వారి ఆట పథకం నిశ్చయం చేసుకున్నారు. జూనియర్‌వారు కలుసుకున్నది ఆనందం కోసమే! ఇంక వారి పథకం ఒక్కటే ఉన్నది, ఎల్లమందకు సీనియర్ జట్టువారు ఇవ్వబోయే ఒత్తిడి తగ్గించడము. బ్రహ్మప్రళయ మయినా చేసి ఎల్లమందకు బంతి అందిస్తూ ఉండడము. ఈ విధానము కలిసి అనుకోకుండానే గోల్‌కీపర్ దగ్గర్నుంచి సెంటరు ఫార్వర్డు వరకు బంతి అందివ్వడమే వ్రతంగా పెట్టుకున్నట్టయింది.

ఇకనేమి? ఎల్లమంద చుట్టూ సీనియర్ జట్టు హాఫ్‌బాక్‌లు ముగ్గురూ ఉన్నారు. ఎల్లమందకు బంతి రానివ్వరు. ఈ గొడవలో ఆటంతకూ కీలకం అయ్యాడు ఎల్లమంద. ఎల్లమంద ఈలాంటి కాలిబంతి యుద్దాలలో ఆరితేరిన సరుకాయెను. అతను గబగబ బంతి దగ్గర లేనిదే పరుగు పందెంలా ఈ చివరనుంచి ఆ చివరకు ఆ మూడుసారులు వరసగా పరుగెత్తినట్లు పరుగెత్తినాడు. ఆ మహావేగం అతనికే చెల్లు. అతనితో సీనియర్ జట్టులోని హాఫ్‌బాక్‌లు ఏం పరుగెత్తగలరు? అలసటపడి ఊరుకున్నారు.

ఎల్లమంద నాలుగో పరుగులో బంతి అందుకున్నాడు. ఇంక అతను యెవ్వరికీ అందలేదు. బంతితోనే గోలులోనికి వెళ్ళిపోయాడు. ప్రభూ! ఆ సమయంలో ఆ ఆటస్థలం ఒక తుఫాను, ఒక గోదావరి వరద అయి చక్కాపోయింది.

సీనియర్లు పదకొండుగురూ ఎల్లమంద చుట్టూ మకాం వేస్తారా ఏమిటి చెప్మా? అతని చుట్టూ ఇనుపగోడ కడతారా? అతని చేతులు కాళ్ళూ కట్టి పారవేస్తారా? అలాగే ప్రయత్నం చేశారు వాళ్ళు. అయినా ఎల్లా తప్పుకున్నాడో రెండుసార్లు, ఆ రెండుసార్లూ రెండు గోలులు చేసినాడు.

అక్కడనుంచి, ఫుట్‌బాల్ ఆట స్వరూపమే పోయింది. ఎల్లమందని అధర్మంగా సీనియర్ ఆటగాళ్ళు ఫౌల్ చేశారు. ఒకసారి మోకాలు కొట్టుకుపోయి రక్తం కొల్లయింది. ఐనా ఏదో గుడ్డ చుట్ట బెట్టుకు ఆడాడు. అతడు ఉగ్రుడై పోయాడు. బంతిని ఒక్క నిమిషం వదలడు. తానే వెళ్ళి బంతి అందుకుంటాడు. వేగంగా వెళ్ళిపోతాడు. అడ్డం వచ్చిన వాళ్ళను జెలగలా తప్పుకుంటాడు. ఆ సమయంలో నలుగురో అయిదుగురో సీనియర్ జట్టువాళ్ళు అడ్డంపడతారు. అతన్ని కుమ్ములు, గుద్దులు తన్నులు అయినా


అడివి బాపిరాజు రచనలు - 7

11

నరుడు(సాంఘిక నవల)