పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతని హృదయంలోనూ సుశీలాదేవి విషయంలో స్త్రీ పురుష సంబంధ విషయకమైన భావాలు కలుగలేదు. అలాంటి భావాలేమైనా పద్మావతీ వెంకట్రావుల హృదయ మూలాల స్పందనం అయివుండెనో ఏమో! కాని వారిద్దరి ఆవేదనలూ తగ్గిపోయాయి.

పద్మావతి ఇప్పుడు విద్యాలయంలో తృప్తిగా చదువుకుంటున్నది. తోటి బాలికలతో ఎక్కువ చనువును సంపాదించుకుంటున్నది. వారితో కలిసి తిరగడం ఆమెకు ఎక్కువ ఇష్టమైనది. అంతకంతకు శ్రీమతి కరుణామయిగారితో ఆమె స్నేహం వృద్ధి పొందింది.

కరుణామయికి పద్మావతి అంటే చెప్పలేని దయ కలిగింది. ఆమె ఎక్కువ శ్రద్ధ వహించి తానే ఎన్నో విషయాలు ఆమెకు బోధించేది. పద్మావతి సభలలో నిర్భయంగా సంగీతం పాడేట్లు చేసి, ఆమె సభా పిరికితనం మాయంచేసింది.

ఇంతలో దసరా ఉత్సవాలు వచ్చినవి. ఆ ఉత్సవాలలో ఒక రోజున రాధాకృష్ణ, సుశీల, పద్మావతిగార్ల సంగీతపు కచ్చేరీ జరిగింది. ఆ రోజున పద్మావతి అపర మీరాబాయిలా ప్రకాశించింది. సంగీతంలో సుబ్బులక్ష్మికి దీటనుపించుకుంది. పాడినపాటలలో ఒకటి మాత్రమే త్యాగయ్య కృతి. తక్కినవన్నీ ఈనాటి కవులలో ప్రసిద్ధికెక్కినవారి పాటలు, కృష్ణశాస్త్రిగారి ఊర్వశీ గీతమొక్కటీ, మురళీ గీతమొక్కటీ పాడింది.

“మోయింపకోయ్ మురళి మొయింపకోయ్!” అన్న పల్లవిలో రాధాదేవిలో ప్రతిభక్తునిలో, మురళీకృష్ణ దివ్యభావంవల్ల ఉద్భవించే పరమ మనోహరానందం రాగంలో అవరోహణంలో చూపించింది - "తీయ తేనియ బరువు మోయలేదీ బ్రతుకు” అని అనుపల్లవి ఎత్తుకొని, ఆ ఆనంద వివశత్వం, ప్రియా ప్రణయగాఢోత్కంఠితయైన రాధ ఆ విశ్వసౌందర్యంలో లయమూ కావాలి. లయము కాకుండా తన దివ్యపురుషునితో సాలోక్య, సారూప్య సామీప్యానందమూ పొందాలి.

ఆ పాట శ్రోతల హృదయాలు కరిగించినది. ఆనందంతో అనేకమంది స్త్రీల కన్నులనీరు జలజల ప్రవహించాయి.


★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 7

135

జాజిమల్లి(సాంఘిక నవల)