పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుశీల బుచ్చి వెంకట్రావుకోసం రాగానే అతని భుజాల మీద చేయివేస్తుంది. ప్రక్కనే కూచుంటుంది. అతని ఛాతీ మంచి విశాలమైనదని తడుముతుంది. దండలు ఉక్కుతో చేసివుంటాయని నొక్కుతుంది. తనకు బలమైన వాళ్ళను చూస్తే ఆనందమంటుంది.

సుశీల కలుపుగోరుతనమూ, ఆమె లేనిపోని పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకోకుండా తనతో సాయిలా ఫాయిలాగా ఉండడమూ అతనికి చాలా ఆనందం కలిగింది. అతని హృదయంలో ఏవో బరువులు కరిగిపోయినట్టయినది.

మధ్య మధ్య ఆంధ్రమహిళాసభ పాఠశాల ప్రధానోపాధ్యాయిని అనుమతితోనూ, వసతిగృహాధికారిణి అనుమతితోనూ పద్మావతిని రాధాకృష్ణగారింటికి బుచ్చి వెంకట్రావు తీసుకువచ్చేవాడు. ఆ సమయంలో రాధాకృష్ణ ఆనందానికి మేరలేకపోయేది. పద్మావతీ అతడూ సంగీతం అని కూచునేవారు. రాగాలు, తాళాలు సినిమాలలో ఆనాడు ఎక్కువగా వాడుకలోకి వచ్చిన పాటలు, అవి విపరీతంగా ప్రజామోదం పొందటానికి హేతువులు, గట్టి సంగీతం ఎందుకు ప్రజలకు భరింపరానిదవుతుంది - ఈ విషయాలు ఆమెకు చెప్పేవాడు రాధాకృష్ణ, ఆమెకు ఉత్తరాది, మహారాష్ట్ర సినీమాల పాటలు గ్రామ ఫోనులో వినిపించేవాడు. తానిచ్చిన వరసలు ఉత్తరాది వరసలకన్నా దక్షిణాది వరసలకన్నా ఎందుకు బాగుంటాయో చెపుతూ, తన వరసలూ ఆయా పాటల వరసలూ పాడి వినిపించి ఆమెకు తెలియజేసేవాడు.

ఆ మేడలో సుశీలా వెంకట్రావు ఒక వైపునకూ పద్మావతీ రాధాకృష్ణ లొకవైపునకూ తేలుకు వెళ్ళేవారు. పద్మావతిని ఏదో వంకతో రాధాకృష్ణ స్పృశించేవాడు. ఆమె దేహం తన శరీరానికి తగులుతూ ఉండేటట్లు సోఫాలో కూచునేవాడు. నడుస్తూ ఉన్నప్పుడు, ఆమె నడుం చుట్టూ చేయి వేసేవాడు.

మొదట పద్మావతి భయపడింది. ఈ విధానం అతి నవీనం కాబోలు. ఇందులో తప్పులేదని సమాధాన పెట్టుకున్నది. అంతకంతకు రోజులు గడచిన కొద్దీ ఆ బాలికకు రాధాకృష్ణ స్నేహం అతి అవసరమైనది. సంగీతం విషయాలు నేర్చుకొనడం ముఖ్యమే! అంతకన్న ముఖ్యం రాధాకృష్ణ మాటలే! అతడు మాట్లాడేవన్నీ ఆమెకు తెలియవు. అతడు ఏవేవో చెప్పేవాడు. అతడు ప్రపంచంలోని అన్ని విషయాలు తెలిసికోలేదు. అతని చదువూ అంత పెద్దదికాదు. రోజూ వచ్చే దినపత్రికలు వార్తలిస్తాయి. కొన్ని ఉపన్యాసాలు ముద్రిస్తాయి. అవి విజ్ఞాన విషయాలేమి చెప్పగలవు? స్నేహితులైన సినీమావారు మాట్లాడుకునే మాటలూ, చప్పచప్పని ఆరణాల మాస, పక్షపత్రికలు ఏమంత జ్ఞానం ఈయగలవు?

అయినా ఇప్పుడిప్పుడే ప్రపంచజ్ఞాన వాతావరణంలో హృదయపుష్పపుటాలు విప్పుతూన్న పద్మావతికి అతడు ఏ విషయం చెప్పినా అవన్నీ అద్భుతంగా ఉండేవి. ఇంతకూ అతడు అదృష్టవంతుడూ, చాలా తెలివైన సంగీతదర్శకుడూ!

ఇటు పద్మావతికి ఏ రీతిగా ఏదో సంతృప్తి హృదయం నిండిపోయిందో, ఆ రీతిగా సుశీలాదేవి స్నేహంవల్ల బుచ్చి వెంకట్రావుకు వర్ణింపరాని తృప్తి కలిగింది.

అడివి బాపిరాజు రచనలు - 7

134

జాజిమల్లి(సాంఘిక నవల)