పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతి వేగమైన ఒక ప్రవాహంలోపడి తాను కొట్టుకొచ్చాడు. తగిన శిష్యురాలై తనకు పేరు ప్రతిష్ఠ తెచ్చిపెట్టుతుంది అనుకున్న పద్మావతి తన దగ్గరకు రావడమే మానేసింది. పోనీ, సంగీతాభ్యాసం కోసం ఎవరైనా ఒక పెద్ద సంగీత విద్వాంసుడి దగ్గరకు వెళ్ళుతున్నదా అంటే, ఆ వెళ్ళడమూ మానుకుంది. ఆడవాళ్ళ మనోభావాలెవరికర్దమౌతాయి? అసలే సంగీతం మానివేస్తుందేమో, అని లోలోన అతడు భయపడినాడు.

తాను వట్టి వంట బ్రాహ్మణుడై పోయినాడు. వీరిరువురి కోసమూ తాను పాడుకునే సంగీతమూ కూడా అభ్యాసము చేసుకోవడము లేదు. సంగీతము భగవతార్చన అని అనుకున్న తాను చేపల వాసన కొట్టే ఒక బెస్తల దాంపత్యం, తన్నంత ఇంద్రజాలంలో ముంచివేయడం ఒక విచిత్రమే. ఆమె తనకు ఒక కూతురుకన్న యెక్కువైనది. ఉత్తమ విద్య విషయంలో కులం తేడాలు వుండనే వుండవు. అసలు కులం తేడాలేమిటి? ఏ విధంగానూ గోడలు కట్టని మూడు ముఖ్యమైన కులాలు వేదకాలంలో వుండేవంటారు. వారిలో ఒకరికొకరికి సంబంధ బాంధవ్యాలు, భోజన ప్రతి భోజనాలు ఉండేవి కాదా! రాను రాను జనసమృద్ధి ఎక్కువై, భావసంఘర్షణలు వృద్ధియై అనేక కులాలు ఉద్భవించాయి! ఏమిటి తనకీ ఆలోచనలు! ఏది ఎట్లాయైనా వీరిద్దరు తన బిడ్డలు! వీళ్ళు వృద్దిలోనికి రావడం అతను కన్నులారా చూశాడు. ఆ వృద్ధిలో తాను పాలుపంచుకొన్నాడు. వాళ్ళిద్దరినీ తల్లిలా పెంచాడు. చూస్తూ చూస్తూ ఉండగా ఏదో పెనుభూతం వాళ్ళ జీవితాన్ని ఆవహిస్తున్నట్లు అతనికి భయం ముంచుకువచ్చింది.

ఏమిటీ పెనుభూతం? ఎవరిలోటు? అంత ప్రేమించుకున్నారే! ఒకరినొకరు విడవకుండా ఉండేవారే! విడిచి బ్రతుకలేక పోయేవారే! ఒకరికోసం ఒకరు రూపాలు దాల్చినట్లుగా, ఈడుజోడై తన కన్నుల యెదుట తిరుగుతూ ఉండే వారే! ఏమిటి ఈనాటి ఈ పరిస్థితి! నరసింహమూర్తి మేష్టారు దినదినమూ ఆంధ్ర మహిళా సభకు వచ్చి పద్మావతిని చూచిపోతూ ఉండేవాడు. సాయంకాలము కాగానే పిల్లలందరు సభలో ఉన్న తోటలో ఆడుకొంటూ ఉండేవారు. కొందరు కేరంబోర్డ్సు ఆడేవారు. ఊయల ఊగేవారు కొందరు. బల్ల బంతి ఆట ఆడేవారు కొందరూ. బల్ల ఊపు ఆట ఆడేవారు మరి కొందరు. ఇలా కలకల ఆటల్లో పొంగి బాలికల మధ్య ఎక్కడో పద్మావతి ఒక్కతే కూచుని ఆలోచించుకుంటూ ఉండేది!

ఆమె కేమీ ఆలోచనలు తెగేవికావు. ఇంతట్లో నరసింహమూర్తి మేష్టారుగారు వచ్చారనగానే ఆమెకు కొంత ఊరట కలిగేది. వెంటనే అధికారి అక్కగారిని సెలవు వేడి, ఆ బాలిక నరసింహమూర్తితో సముద్రం ఒడ్డుకు వాహ్యాళికి బయలుదేరింది. పన్నెండో నెంబరు బస్సు ఎక్కి ట్రిప్లికేనులో దిగి, సముద్రం ఒడ్డుకు పోయేవారు వారిద్దరూ!

ఓనాడు వారు అక్కడ కూచుండగా నరసింహమూర్తి సతీర్థుని శిష్యుడైన ఒక యువకుడు వీరిద్దరూ కూచున్న కడకు వచ్చాడు. ఆ యువకుడు నరసింహమూర్తికి కొన్నాళ్ళు శిష్యరికం చేసినాడు.

యువకుడు. “నమస్కారం నరసింహమూర్తి మేష్టారూ! మద్రాసు ఎప్పుడు వచ్చారు? ఇక్కడ పనేమిటి? ఎంతకాలం ఉంటారిక్కడ?” అని ప్రశ్నల వర్షం కురిపించాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

117

జాజిమల్లి(సాంఘిక నవల)