పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరసింహమూర్తి ఒక్క నిమిషం అతణ్ణి ఆనవాలు పట్టలేక పోయినాడు. “ఓహో! నువ్వటోయ్ రాధాకృష్ణా! నీ వేషం చూచి నిన్నానవాలు పట్టలేకపోయినాను సుమా! ఏం చేస్తున్నా విక్కడ? ఎన్నాళ్ళనుండి ఉన్నావు?” అని ఆనందంతో లేచి, అతన్ని కొంచెం దూరంగా తీసుకువెళ్ళి ఆ ఇసుకలో అతన్ని కూచోబెట్టి తానూ కూచున్నాడు. వారి మాటలు పద్మావతికి వినబడుతున్నాయి.

ఆ యువకుడు రాగానే పద్మావతి అతన్ని కొంచెం ఆశ్చర్యంగానే చూచింది. పట్టుపయిజామా, పట్టులాల్చీ. చేతికి కొంచెం ఖరీదుగల రిస్టువాచీ, మెళ్ళో సన్నని బంగారపు గొలుసూ ఆ గొలుసును వేలాడుతూ ఏదో ఓ చిన్న పతకమూ! కళ్ళకు ఫ్రేములేని అద్దాలజోడు! కాళ్ళకు జరీ పూవులు కుట్టిన మొఖమల్ చడావులున్నాయ్! ఈ యువకుడు చాలా గమ్మత్తుగా ఉన్నాడు. గిరజాలులా జుట్టు చిత్రంగా సముద్రపుగాలికి ఎగురుతూ ఉంది. అతడూ నరసింహమూర్తి మేష్టారు మాట్లాడే మాటలు వింటూ, ఆ యువకుని గమనిస్తూ ఆమె కూచుని ఉన్నది.

“నేను ఇక్కడ ఓ సినిమా కంపెనీలో సంగీత దర్శకునిగా ఉన్నాను. భరతనాట్యం కూడా బాగా నేర్చుకున్నాను. గొంతు చాలా తియ్యగా సైగల్ కంఠంలా వుండడంచేత కథానాయకునికి నా కంఠం ఇస్తూ వుంటాను.'

“ఆశ్చర్యమే! ఎంత సంపాదిస్తున్నావు?”

“ఏదోలెండి. నెలకు రెండు మూడువేలు! సంగీత దర్శకునిగా ఒక్కొక్క చిత్రానికి పదివేలు చొప్పున ఇస్తారు. కంఠం ఇచ్చినందుకు పాటకు వేయి రూపాయలు. డాన్సు డైరెక్టరుగా ఉంటే అయిదారువేలు. ఒక్కొక్కసారి రెండు మూడు కంపెనీలలో పనిచేస్తూ వుంటాను.”

“ఏమిటీ! బాగానే ఉందోయ్ నీ పని. నాకూ సినిమాలలో పని యిప్పించ కూడదటయ్యా ?”

“దానికేముందండి మేష్టారు! అదిగో అందమైన చిన్న కారు చూశారా! బేబీఫియట్టంటారు దాన్ని. అది నా స్వంత కారు. మా కుటుంబానికి ఒక హిల్‌మాన్‌మిన్క్సు” కొన్నాను. దానికి డ్రైవరున్నాడు."

“చాలా బాగా ఉంది. ఫస్టుక్లాసు! ప్రజ్ఞ అంటే నీదీ ప్రజ్ఞ!”

“మా ఇంటికోసారి రండి మేష్టారు!"

“తప్పకుండానోయ్”

“అచ్చా! అయితే అడగవచ్చునో అడగకూడదో! మరి, ఆ అమ్మాయి ఎవరు? మీ బ్రహ్మచర్యానికి స్వస్తి చెప్పారేమిటి? ఎవరా సినిమాతార! సినిమాలో చేర్పించడానికి తీసుకువచ్చారా? అయితే మనం చాలా సహాయం చేయగలం.”

“ఛా! ఛా! ఆ అమ్మాయి నా బిడ్డవంటిది. వంటి దేమిటి, నా పెంపుడు బిడ్డే! నా దగ్గిర సంగీతం నేర్చుకుంటూంది. మా వూరే. కావలి. వాళ్ళు బెస్తలులే! అయినా

భాగ్యవంతులు. ఆవిడ భర్త ఈ ఊళ్ళోనే పెద్ద వ్యాపారం చేస్తున్నారులే!"

అడివి బాపిరాజు రచనలు - 7

118

జాజిమల్లి(సాంఘిక నవల)