పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మావతి దేశాలు తిరిగింది. కంచిలో కామాక్షీ, ఏకామ్రేశ్వరుడూ, వరదరాజూ; తంజావూరులో బృహదీశ్వరుడూ, పెరియనాయకీ, చిదంబరంలో నటరాజూ, శివకామసుందరీ; శ్రీరంగంలో రంగనాయకుడూ, లక్ష్మిదేవి; మధురలో మీనాక్షి, సుందరేశ్వరుడూ; రామేశ్వరంలో రామలింగస్వామి, పర్వతవర్ధనీ ప్రత్యక్షమయ్యారు. ఆ పవిత్ర క్షేత్రాలలో భక్తుల ఆనందం ఆమె హృదయానికి పులకరింపులు కలుగజేసింది.

ఇంక ఈ శిల్పక్షేత్రాలేమిటి? పూజలుపోయినా శిల్ప సౌందర్యం ఉంటే. ఆ విగ్రహాలు మనుష్యులకు కళానందం కలిగిస్తాయని మహిళా సభలో కొందరు కళా విద్యార్థినులు అంటూ వుంటారు. దేశం అంతా ఇట్లాంటి క్షేత్రాలెన్నో ఉన్నాయట. ఎల్లోరా, అజంతా, నాగార్జునకొండ, హంపీ, లేపాక్షి, అనుమకొండ, ఒరంగల్లు, సాంచీ మొదలయిన క్షేత్రాలెన్నో ఉన్నాయట. ప్రసిద్ధికెక్కిన దేవతల గుళ్ళల్లో కూడా ఎన్నో ఉత్కృష్టమైన శిల్పాలు ఉన్నాయట. శిల్ప క్షేత్రాలలో ఈ మహాబలిపురం ఒకటి అన్నారు. ఈ విగ్రహాలన్నీ అదో అందం కలిగి ఉన్నట్టు ఆమెకు తోచింది. శిల్పం అన్నా, చిత్రలేఖనం అన్నా తన ఉద్దేశాలు ఇదివరకు వేరు. దేశం అంతా గాంధీ విగ్రహాలు వెలిశాయి. అవే శిల్పాలనుకొంది. మదరాసులో కొందరి తోటల్లో, సిమెంటు చేసిన సింహం, కుస్తీపట్టేవాడు, బంట్రోతు మొదలైన విగ్రహాలే నిజమైన శిల్పం అనుకొన్నది పద్మావతి. చిత్రలేఖనాలు అంటే బజారులో దొరికే అచ్చుబొమ్మలనే ఆమె ఉద్దేశం.

దారిలో తిరుక్కలికుండ్రంలో ఆగి ఆ పక్షి తీర్థం చూశారు వారంతా. తామంతా సర్దాగా కొండ ఎక్కారు. దారిలో అల్లర్లు చేశారు. ఆడుకున్నారు. పాడుకొన్నారు. కొండమీదికి వెళ్ళిన వెనక పూజారి పక్షులను పిలవడం అవి రావడం; ప్రసాదం ఆరగించడం, మళ్ళీ దేని దిశకు అవి వెళ్ళిపోవడం ఆ దృశ్యాలు పద్మావతి కెంతో ఆనందం కలిగించాయి. ఒక పక్షి కాశీ నుండి వస్తుందట - ఇంకొక పక్షి రామేశ్వరాన్నుంచి వస్తుందట.

ఆ పక్షులు మొదట ఏ అనంత నీలాల్లో నుండో ప్రత్యక్షమయ్యాయి. ఆకాశంలో గాలిపడగల్లా తేలుకొని వచ్చాయి. తన మనస్సు తిరిగిపోయినట్లే ఆ రెండు పక్షులు వాలుతూ గిరగిరా తిరిగినవి. తేలుకొని డేలుకొని వచ్చి పక్షులు పూజారికడ వాలినవి.

కొందరు ఉపాధ్యాయినులు ఇదంతా హుళక్కిఅన్నారు - "ఆ పక్షులు ఆ చుట్టు ప్రక్కలనే కొండలలో ఉంటాయి. సరిగ్గా, భోజనం వేళకు అవి వచ్చి వాల్తాయి!” అంది సైన్సు ఉపాధ్యాయిని.

“అయితే ఈ చుట్టుప్రక్కల వున్న అన్ని గరుడ పక్షులూ ఎందుకు రాకూడదండీ!” అని పద్మావతి ప్రశ్నించింది.

“వాటికి భయం!”

“వీటికెందుకు లేకపోయింది?”

“వీటిని పెంచి ఈలా అలవాటు చేసి ఉంటారు!”

“ఈ పక్షులు ఎంత పూర్వకాలంనాటివో?”

“ఒక జత ముసలివైపోగానే ఇంకో జతను తయారుచేస్తారు.”

అడివి బాపిరాజు రచనలు - 7

115

జాజిమల్లి(సాంఘిక నవల)