పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలాంటి భార్య ఈనాటి కాతనికి దూరమైనది. ఆమెకు స్వకీయమైన పరిమళము ఆమె తన ప్రక్క నిదురపోవునప్పుడు. మేలుకొని తన్ను లతలా చుట్టివున్నప్పుడు. తనతో సమంగా నడిచి వచ్చేటప్పుడు తన అంకాసనం అలంకరించి ఉన్నప్పుడు తన్ను పొదివికొని పోయినప్పుడు. ఆ సురభిళము తన జీవితంలో ఒక భాగమైనదది. ఆ సుగంధము నేడు తనకు దూరమైపోయింది.

ఏమి జరిగినది? ఎందుకు తనకామె ఇలా దూరమైపోయినది? ఆనందపూర్ణమైన తమ దాంపత్య పూర్ణిమను నేడు ఏ రాహుగ్రహము మ్రింగివేసినది? పుష్పానికి పరిమళంలా తన చిన్నారి భార్యకు సంగీతము, నేడా సంగీతము ఆమెను ఎచ్చటికో లాక్కొనిపోతోందా? చిన్ననాటి నుంచీ ఆ బాలిక తనకు వేయి తిమింగిలాల బలం సమకూర్చేదికదా? ఆమె చూపుల రక్షణలో సముద్రపు మొసళ్ళన్నా భయపడక, అతివేగంగల ప్రవాహాలన్నా భయపడక ఎన్నిసార్లు తాను సముద్రంలో ఉరకలేదు! -

తనకు చదువువస్తూ కవిత్వము అర్థమయ్యే ఈ రోజుల్లో ఆమె తనకు వేయికాంతులతో దర్శనమిచ్చే ఈనాడు, ఆమె పెదవులలో ఉద్భవించిన కాంతులలో నూరవపాలు ఎరుపులలో నుండి పగడాలు పుట్టివుంటాయి అని అనుకున్నాడు. ఆమె నవ్వితే తళతళలాడే పళ్ళ తళుకులలో నూరవపాలు ధగధగలోంచి ముత్యాలు పుట్టాయి అనుకున్నాడు. దట్టంగా, నల్లగా, ఒత్తుగా, పట్టులావున్న ఆమె జుట్టు చీకటిలోనుండి నూరవపాలు నిగనిగలు సముద్రపు లోతులై వుంటాయని బుచ్చి వెంకట్రావు సరిపోల్చుకునేవాడు.

పద్మావతి ఎందుకు వెళ్ళినట్లు? తానేదోషము చేసినాడు? ఆమె మనస్సు చెడిపోలేదుకదా? ఆమె ఎడబాటు నానాటికి అతనికి భరించరానిదై పోయినది. సినిమాలకు వెళ్ళేవాడు. కథలు అర్థమయ్యేవి కావు. అప్పటికింకా మద్రాసు నగరంలో ప్రొహిబిషన్ రాలేదు. బుచ్చి వెంకట్రావు బసోటోకో, కాన్మెరాకో పోయి కొంచెం ఘాటైనవి ద్రాక్షసారాయి, బీరులు, విస్కీలు, బ్రాందీలు వగైరాలు మొదట సోడాలో కలిపి, ఆ తరువాత ఏమీ కలుపకుండా సేవించడం ప్రారంభించాడు. తన పనియందు శ్రద్ధ తగ్గిపోయినది. జాగ్రత్త తక్కువయ్యేటప్పటికి అతని కంపెనీ వ్యవహారాలు చిక్కులు పడసాగినవి.

అతని పురుషత్వము స్త్రీ స్పర్శను సర్వకాలము కోరే గాఢవాంఛతో నిండినది. స్త్రీ శరీర సంచలిత సౌరభాలు ఆఘ్రాణించక ఒక్క నిమేషమైన అతడు మనలేకపోయినాడు. ఇంతవరకూ అతని ప్రపంచము అతని భార్యే, నేడు ఆ ప్రపంచము శూన్యమై పోయింది.

4

పద్మకు కలలో ఎన్నిసార్లో భర్త కనబడేవాడు. ఆ కలలు ఒక్కొక్కప్పుడు, హృదయ బాధాపూర్ణమైన సంఘటనలతోనూ, ఒక్కొక్కప్పుడు ఉత్సాహసమ్మిశ్రితానుభవ యుక్తంగానూ ఉండేవి.

ఎలా వచ్చింది తనకీ బాధాపూర్ణమైన పరిణామం? ఎందుకు? ఏ మార్గాల తన జీవితం ప్రవహించబోతున్నది? ఎంతవరకు? ఏదికోరి? దైవమనుకొన్న భర్తను

అడివి బాపిరాజు రచనలు - 7

111

జాజిమల్లి(సాంఘిక నవల)