పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆపుచేయండి. లేకపోతే నేను నిజంగా ఏ సముద్రంలోనో పడిపోతాను” అని పద్మావతి భర్తతో కేకలువేస్తూ ఒకరకంగా ఏడుస్తూ చెప్పింది.

ఆంధ్ర మహిళా సభ కార్యదర్శిని పద్మావతికి “నాలుగు రోజుల పాటు మహిళా సభలోనే మకాము పెట్టండి పద్మావతిగారూ! పిల్లలతో, ఈ మాష్టర్లతో కాస్త కాలక్షేపం జరిగి మీ మనస్సు నెమ్మదిస్తుంది” అని సలహా యిచ్చింది. ఆ సలహా బుచ్చి వెంకట్రావుకు నచ్చింది, వాళ్ళ చుట్టాలందరు బాగుందన్నారు. పద్మావతి వచ్చి మహిళాసభ హాస్టలులో చేరింది. ఇదివరకల్లా విద్యార్థినిగా వుండనే వుంది.

3

ఆంధ్ర మహిళాసభలో చేరిన దగ్గరనుండి పద్మావతి నెమ్మది నెమ్మదిగా శాంతించి ఆమె హృదయంలో ఏమూలనో దాగుకొనివున్న భయాలు మంచువలె మాయంకాసాగాయి. ఆ భయాలకు కారణమైన పరిస్థితులు ఆంధ్ర మహిళాసభలో లేవుకదా?

తాను తన భర్తతో ఏకశయ్యాగతురాలు కానక్కరలేదు. హాయిగా ఏ విధముగా పురుషుని సంపర్కములేని ఒక నిశ్చలత్వము ఆమెకు ఆంధ్ర మహిళా సభలో దొరికినది. తోడుగా చదువుకునే బాలికలుగాని ఇతరులుగాని అతి తెలివితేటలుగా మాట్లాడుతారని కాదు; ఆధ్యాత్మిక చింతన చేసినవారు అక్కడ వున్నారనే కాదు; ఇన్నాళ్ళనుంచీ ఏ చిత్తవృత్తి తనలో వృద్ధిపొంది తనకు శాంతము దూరము చేసిందో ఆ చిత్తవృత్తికి కారణాలైన పరిసరాలనుంచి ఆమె విడివడి రావడమే పద్మావతికి శాంతం చేకూర్చింది.

సాయంత్రం వాళ్ళందరు సభకు ముందున్న తోటలో చేరి కథలు చెప్పుకుంటూ వుంటే తాను “ఊ” కొట్టేది, తనకు తెలిసిన కథలు చెప్పేది. వాళ్ళతో ఉయ్యాలలూగేది. కారమ్సుబోర్డులో పందేలు వేసేది. డాక్టరు లక్ష్మి బుచ్చి వెంకట్రావుతోను పద్మావతితో కూడా వాళ్ళిద్దరూ కొన్నాళ్ళపాటు విడిగా వుండటమే మంచిదని సలహా ఇచ్చింది.

బుచ్చి వెంకట్రావు ధనవంతుడు. ధనం తేనెవంటిది. తేనె ఈగలను ఆకర్షిస్తుంది. ధనం ఒక రకమైక ఈగజాతి మనుష్యులని ఆకర్షిస్తుంది. వెంకట్రావుకు స్నేహితులకు కొదవేమిటి? మనుష్యులలో ధనము సంపాదించేవాళ్ళు మూడు జాతులుగా తయారవుతారు. ధనం ఇంకా కావాలనుకునేవారు. వాళ్ళు ధనం పోగుచేయడంలో ఆనందం. ధనం పెంచడంలో పరమార్థం ధనం పెరగడమే. రెండో రకం వాళ్ళు తాము సంపాదించిన ధనం, తాము సంతృప్తిగా అనుభవించాలని కోరుకుంటారు. మూడోరకంవారు తాము సంపాదిస్తూన్నట్లు లోకానికి తెలియాలి. తమ ఐశ్వర్యము చూచి లోకం దిగ్రమ చెంది అసూయపడిపోవాలి. అది వారి కానందం.

బుచ్చి వెంకట్రావు యీ మూడు రకాలుగా కూడా ఆనందపడేవాడు. భార్య చక్కని నగలతో, అందమైన చీరలతో దేవలోకంనుంచి తిలోత్తమలా దిగివచ్చినట్లు కనబడుతూ తనతోపాటు సినిమాలకు రావడం, బీచికి రావడం ఎంతో ఆనందంగా వుండేది. ఏ మాత్రమూ బొద్దుకాకుండా చిన్ననాటి అంగసౌష్ఠవమూ పరిపూర్ణత పొందిన శరీర సౌందర్యము కలిగి, లావణ్యమును అమృతధునీ సంగమమొంది, పద్మావతీ నేడు ఎల్లోరాలోని ముప్పది నాలుగవ గుహలోని శచీదేవి విగ్రహంలా వున్నది.

అడివి బాపిరాజు రచనలు - 7

110

జాజిమల్లి(సాంఘిక నవల)