పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏమైనా బుచ్చి వెంకట్రావు హృదయంలో ఏదో భయం ప్రవేశించింది. ఎప్పుడూ నిర్మలమైన హృదయంతో చంటిబిడ్డలా ఆడుకొనే తన పద్మావతి ఏమిటి ఇలా అయిపోతున్నది? నిజంగా దాని వంట్లో పెద్ద జబ్బు ప్రవేశించిందేమో! ఏలాగా? డాక్టరు దగ్గిరకురాదు; కనుక దిట్టమైన డాక్టరును ఒకరిని ఇంటికే తీసుకొని వచ్చి పద్దాలుని పరీక్ష చేయించడం మంచిది.

ఆ మర్నాడు ఉదయం డాక్టరు లక్ష్మి అనే ప్రసిద్ధి వహించిన వైద్యురాలిని బుచ్చి వెంకట్రావు తీసుకొని వచ్చినాడు. ఆమె పద్మావతిని పూర్తిగా పరీక్ష చేసినది. జ్వరం రావటం లేదాయెను. ఒళ్ళు నొప్పులు మామూలేగాని, ఎచ్చటా ఎక్కువగా నొప్పిగాని పోటుగానీ లేదాయెను. మొదట డాక్టరు లక్ష్మి బుచ్చి వెంకట్రావు మాటలు విని ఆమె గర్భవతేమోనని అనుకున్నది. అదీలేదు. ఇంక ఏమిటి?

పద్మావతికి వంట్లో ఏ విధమైన జబ్బూ లేదని నరములు నీరసించి యుండవచ్చునని మానసికమైన వ్యధ ఏదో ఆమెకు తెలియకుండానే ఉద్భవించి యుండవచ్చునని డాక్టరు లక్ష్మి బుచ్చి వెంకట్రావును వేరే తీసుకొని వెళ్ళి చెప్పినది. అతణ్ణి ఆమెను సర్వదా సంతోషము కలిగేటట్లు చూడమని ఆమె నొక్కి చెప్పినది.

పద్మావతిని చూచి డాక్టరు లక్ష్మి, “పద్మావతమ్మ గారూ, శరీర సంబంధమైన జబ్బు ఏదీలేదు. కాని కొంచెం నరాలు నీరసించాయి. సరదాగా ఉంటూ ఉండండి. ప్రస్తుతం సంగీతం నేర్చుకోవడం ఆపి, నాలుగురోజులపాటు కాలక్షేపం చేయండి. రెండు మందుల పేర్లు మీ ఆయనకు వ్రాసి ఇచ్చాను. అవి పుచ్చుకునే విధానమూ వ్రాసి యిచ్చాను. ఒక్కొక్కటి రెండేసిబుడ్లు చాలు. మీవంటి సంగీత పాఠకులు ఎంతో ఆనందముగా గడపవచ్చునుకదా! సాయంత్రమపుడు మా ఇంటికి రండి. కొంత సేపు రోజూ కులాసాగా కాలక్షేపం చేయవచ్చును.” అని సలహా ఇచ్చింది.

పద్మావతి మందులు పుచ్చుకుంటున్నది. కాని ఆవిడ జబ్బేమీ నెమ్మదించినట్లు లేదు. రాత్రిళ్ళు నిద్రలేక కూర్చోవడం సాగించింది. ఒక్కొక్కప్పుడు ఊరికే ఎక్కి ఎక్కి ఏడవడం, కొంచెం పని సరిగా జరగలేదనుకున్నా విపరీతమైన కోపం రావడం, చేతిలో ఏముంటే ఆ వస్తువుని నేలకేసి గట్టిగా బద్దలకొట్టడం, చీరలు, రవికెలు చింపుకోవడం. గబ గబా తల బాదుకోవడం ఆవహించాయి.

బుచ్చి వెంకట్రావు భయపడి దయ్యము పట్టుకుందేమోనని అనుమానపడి, కావలి తనవాళ్ళకు టెలిగ్రాము ఇచ్చాడు. అత్తగారు, మామగారు, తన తల్లిదండ్రులు, ఇంకా ఇద్దరు ముగ్గురు చుట్టాలు చెన్నపట్నం చక్కావచ్చారు.

చింతాద్రి పేట నుంచి దయ్యాల మంత్రగాడిని తీసుకువచ్చారు. పద్మావతికి మరీ మతిపోయింది.

“ఏమిటండీ మీ గొడవంతానూ! మీకన్నా మతిలేదు. నాకన్నా మతిలేదు. నాకు దయ్యం పట్టడమేమిటి? ఎందుకు బాధపడుతున్నానో నాకు తెలియదు. మనసంతా పాడైపోయింది. ఇలా దయ్యాలనీ, దేవతలనీ, కుళ్ళుచేపలలో పొర్లాడే మనవాళ్ళ పిచ్చి భావాలన్నీ ఇంకా మిమ్ములను పట్టుకుని వేళ్ళాడుతూనే వున్నాయి. ఇవన్నీ ఇంతటితో


అడివి బాపిరాజు రచనలు - 7

109

జాజిమల్లి(సాంఘిక నవల)