పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మ: ఇంత పెద్దదాన్ని ఇప్పుడు స్కూలు ఏమిటండీ మాష్టారూ?

నర: ఆంధ్ర మహిళా సభలో చేరరాదూ. వాళ్ళు బెనారసు యూనివర్సిటీ ప్రవేశపరీక్షకు పంపిస్తారు. రెండేళ్లలో టింగురంగా అని ఇంటర్‌మీడియట్‌లో చేరవచ్చును.

పద్మ: ఇవాళ మా వారిని అడుగుతానుండండి. ఒక్కప్పుడు నాకు ఈ చదువెందుకు బాబూ అనిపిస్తుంది. ఈ పట్టణవాసం, ఈ మోటారుకార్లు ఈ గడబిడల్లో ఏమి ఆనందం ఉంటుందీ! మా పల్లెలో ఆ సముద్రం వొడ్డునే ఆ ఏటి కాడనే ఎంతో ఆనందంగా ఉండేది.

నర: ఇక్కడమాత్రం సముద్రం లేదటమ్మా.

పద్మ: ఇక్కడ సముద్రం సముద్రంలా అనిపించదండీ.

నర: అక్కడ కెరటాలు ఇక్కడా వున్నాయి. అక్కడ ఇసుక ఇక్కడా వుంది.

పద్మ: ఎట్టా అయినా ఆ సముద్రం వేరు. ఈ సముద్రం వేరు. ఇన్ని లక్షల జనంలో సముద్రం మన సముద్రంలా కనిపించదు. ఎవరి సముద్రమో చూడడానికి వచ్చినట్లుగా వుంటుంది. మాష్టారూ ఈ సముద్రంలో చేపలు దొరుకుతాయీ.

నర: అదేమిటమ్మా! పొద్దున్నే తెప్పలు కట్టుకొని మీవాళ్ళెంతమందో తెల్లారగట్టే సముద్రంలోకి వెళ్ళిపోతారు. పది పన్నెండు గంటలకు తిరిగివస్తారు. తెప్పలనిండా కావలసినన్ని చేపలు పట్టుకువస్తారు.

పద్మ: అవి విదేశీ చేపలేమో!

నర: మంచిదానవే!

పద్మావతి ఆంధ్ర మహిళా సంస్థలో చేరింది. బుచ్చి వెంకట్రావు తాను అగ్నికుల క్షత్రియులమని చెప్పాడు. ఆంధ్రమహిళాసభ విద్యాలయంలో చేరినప్పటినుండి పద్మావతికి దీక్ష ఎక్కువైంది. రాత్రింబవళ్ళు చదువే. మహిళాసభ విద్యాలయంలో వున్న బి.ఏ. పాసయిన ఉపాధ్యాయినిని ఒకరిని ఆమెకు ప్రయివేటు మాష్టరుగా కుదిర్చాడు బుచ్చి వెంకట్రావు.

మద్రాసు వచ్చినప్పటినుంచీ బుచ్చి వెంకట్రావు వ్యాపారం వృద్ధి అయింది. వచ్చిన ఆరునెలలో అతనికి ఎనిమిదివేలు లాభం వచ్చింది. భర్తను ఆంధ్ర మహిళా సభకు దగ్గిరగా యిల్లు అద్దెకు పుచ్చుకోమని పద్మ పోరు పెట్టింది. సలివన్సే గార్డెన్స్‌లో చిన్న మేడ నూరురూపాయలు అద్దెకు కుదుర్చుకొన్నాడు బుచ్చి వెంకట్రావు. అందుకు వేయి రూపాయలు అడ్వాన్సు యిచ్చాడు.

చదువు వస్తున్న భార్య బుచ్చి వెంకట్రావుకు నిత్యనూతన విద్యామూర్తిలా, సౌందర్యదేవతలా కనిపించేది. చదువుకున్న బాలికలతో సహవాసాలు అలవరచుకొన్న పద్మావతికి ఏదో ఒక నూతన ప్రపంచం సన్నిహితం కాసాగినది. చదువులు, దేశాలు, దుస్తుల విధానాలు, వివిధ భాషలు, రాజకీయాలు, అలంకరణలు, ఆనందాలు, శుచి, శుభ్రతలు పద్మావతికి అర్థంకాసాగినవి.

ఆమె ఇల్లు అలంకరించటం నేర్చుకొన్నది. తాను కడిగిన ముత్యంలా ఎప్పుడూ నిర్మలంగా వుండటం నేర్చుకొన్నది. వివిధ సువాసనలు తమ తమ వ్యక్తిత్వాలతో ఆమె జీవితంలోనికి వచ్చి చేరినవి. తాను అర్థం చేసుకొన్న ప్రతి సంస్కృతినీ ఆ బాలిక తన

అడివి బాపిరాజు రచనలు - 7

105

జాజిమల్లి(సాంఘిక నవల)