పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భర్త జీవితంలో కూడా ప్రవేశపెట్టాలనీ ప్రయత్నం చేయసాగింది. బుచ్చి వెంకట్రావు ఆమెకు దాసానుదాసుడైన శిష్యుడైనాడు. వారిద్దరికీ ఈ దైనందిన సంస్కృతి విద్యాశిక్షణ ఎంతో ఆనందం కలిగించే వ్యావృత్తి అయినది.

ఇల్లు అలంకరించుకొనే పాఠం ఉపాధ్యాయిని చెప్పేది. చెప్పిన పాఠమెల్లా ఆచరణలో పెట్టాలని పద్మావతికి కుతూహలం. భర్తతో మారాం పెట్టేది. రోజుకు ఒక కొత్తరకం భావం బుచ్చి వెంకట్రావును ఉక్కిరిబిక్కిరి చేసేది. ఇవాళ కిటికీలన్నిటికి పచ్చరంగు, ఎర్రరంగులు కలిగిన పువ్వులు. రేపు నీలంమీద తెల్లచారలు కలిగిన తెరలు, ఇవాళ పేము కుర్చీలు, రేపు రోజువుడ్డు సోఫాకుర్చీలు “నీకేమైనా మతిపోయిందా?” అంటాడు బుచ్చి వెంకట్రావు.

నరసింహమూర్తి మాష్టారు పద్మావతి భావాలన్నీ వింటూ ఎంతో ముచ్చట పడిపోయేవాడు. ఎంతో కాలం సంగీతంలో ప్రయివేటు మాష్టరుగా వుండి నూరు రూపాయలు నెల్లూరులో సంపాదించుకుంటూ కుటుంబం పోషించుకుంటూ ఉండేవాడు. నేడు అరవైరెండు ఏళ్ళు వచ్చాయి. భార్య పోయింది. బిడ్డలు లేరు. స్వచ్చమైన వెలనాటి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. పెద్దవాడవటంచేత నెమ్మదిగా పాఠాలు తగ్గిపోయినాయి. నెల్లూరు వదలి స్వగ్రామమయిన కావలి చేరుకొన్నాడు. కావలి చేరుకొన్న కొద్దిదినాలకే బుచ్చి వెంకట్రావు 50 రూపాయలిచ్చి నరసింహమూర్తిగారిని భార్యకు సంగీతపు మాష్టారుగా ఏర్పాటు చేసినాడు. నేడు యీ కుటుంబంతో తాను మదరాసు వచ్చాడు. తానింత వండుకొని వాళ్ళిద్దరికి వడ్డించుకు తినమని ఇవతల పెట్టేసేవాడు. పద్మావతే అతనికి కూతురైంది. బుచ్చి వెంకట్రావు అల్లుడైనాడు. వీళ్ళిద్దరి దినదినాభివృద్ధి అతనికి నిత్య సంతోషకారణమైనది.

★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 7

106

జాజిమల్లి(సాంఘిక నవల)