పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కావలిపట్నంలో తాను తన భర్త కాపురం పెట్టిన మొదటి వసంతమాసంలో ఈ జాజిమల్లి పువ్వులు అమ్మకానికి వచ్చినప్పుడు, ఏమిటి యీ కొత్తరకం పూవులు ఇంత అందంగా వున్నాయేమిటి అనుకొన్నది. జీవితం అడుగు భాగాలలో దాగుకొనివున్న ఎన్నో కాంక్షలనూ, ఆశయాలనూ ఈ జాజిమల్లి పూవుల వాసన రేకెత్తించినది. ఎక్కి ఎక్కి పైకి ఎక్కి ఏదో ఒక మహానది ప్రవహించి క్రిందికి దిగే పర్వత సానువుల చరియల అనుసరిస్తూ, ఎక్కుతూ, కొండలు దాటుతూ, ఆ నదీబాలిక ఉద్భవించే పరమరహస్య ప్రదేశాలకే ఆ జాజిమల్లి వాసనలు తీసికొనిపోతున్నట్లుగా ఆమె మనసులో పొంగులు కలిగించేది..

చెన్నపట్నంలో అన్నీ జాజిమల్లిపూలే! అరటిదొప్పలలో దొంతరలు; దండల చుట్టలు, తక్కెడలో తూకాలు! జాజిమల్లియతో సంగమిస్తూన్న కనకాంబరాలు, మరువం కురువేరులున్న కదంబ మాలలు! మదరాసు జాతి కుసుమ వైభవ సమృద్ధమైన మహానగరం.

ఎన్ని కాంక్షలు ఆ నగరంలో ఉద్భవించాయో! తీరని కలలు, గాఢవాంఛలు, ఉత్కృష్టమైన ఆశయాలు జాతీ కుసుమ పరీమళ సంఘాతాలై మదరాసు నగరంలో ఎన్ని బ్రతుకులలోనో పుట్టి పెరిగి, మహాఝుంఝులై గాలివానలై పోతున్నాయో!

4

నరసింహమూర్తి సంగీతం మేష్టారు వాళ్ళింటిలోనే మకాం. నెమ్మదిగా సంగీతం మేష్టారు వంట బ్రాహ్మణుడూ అయ్యాడు; పద్మావతికి పితృదేవుడూ, గురువూ అయ్యాడు. పద్మావతి కనుముక్కు తీరుగల, అందమైన ముఖముకల పడుచు. ఆమెలో నాగరికత స్థానం ఏర్పరచుకొన్నప్పటినుంచీ ఆమెకున్న నీలోత్పలకాంతి ఉజ్వల శ్యామలకాంతి కావొచ్చింది! శరీరం సామ్యాంగ పరిపుష్టమై కాకతీయశిల్ప బాలికా సౌందర్యం మూర్తించుకొన్నది.

సంగీతం మేష్టారు నరసింహమూర్తికి పల్లెపడుచు పద్దాలు ఏవో పరమరహస్యాల పాలసముద్ర తరంగాలలో నుండి అవతరించిన లక్ష్మిలా గోచరమయ్యేది. పల్లెవారికి ఈ అందాలు ఎక్కడనుంచి వచ్చాయి? కాశీరాజుకు మత్స్య గ్రంధి చేపగర్భంలో దొరికినట్లు యీ పద్మావతి కూడా ఏ సముద్రపు అలలకో కొట్టుకు వచ్చిన వరుణదేవుని కొమరిత ఏమో? నల్లవారున్నారు. వారు తెల్లచీర కట్టుకుంటే చీర నల్లబడిపోతుందేమో అన్నట్టుంటారు. కాని పద్దాలు నలుపు రంగు ఆకాశనీలంలా, సముద్రంలోతుల గరుడపచ్చల నీలంలా, నరసింహమూర్తికి దర్శనం అయ్యేది. జూకామల్లి పూవుల నీలంలో వున్న ఆర్ద్రత ఆమె శరీరచ్ఛాయలో వికసించి వున్నదని నరసింహమూర్తి అనుకున్నాడు.

నరసింహమూర్తి: ఏమమ్మా పద్మావతీ! ఏదో ప్రైవేటు మాష్టరును పెట్టి మీ ఆయన నీకు ఏదో వానాకాలం చదువు చెప్పించాడు. నిజంగా సంగీత రహస్యాలే అర్థం కావాలంటే చదువు కూడా బాగా వచ్చి తీరాలి అమ్మాయి.

పద్మావతి : ఇక్కడ కూడా ప్రయివేటు మాష్టారును పెట్టించుకోవచ్చు కాదుటండీ!

నర : ప్రయివేటు మాష్టరు చదువు ఆటా పాటల చదువు. ఏదయినా స్కూలులో చేరి చదువుకోవాలి. ఆ చదువునకు ప్రయివేటు మాష్టరు చదువు బలమిస్తుంది.

అడివి బాపిరాజు రచనలు - 7

104

జాజిమల్లి(సాంఘిక నవల)