పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నతనంలోనూ అతడు ఎన్నడూ వెనుదీయలేదు. ఆమెకు పన్నెండు వచ్చింది. అతనికి పదహారో ఏడు వచ్చింది. అప్పుడే వీళ్ళిద్దరి పెండ్లి చేయడానికి సంకల్పించారు. పెళ్ళి మూడురోజు లుందనగా బుచ్చివెంకన్న పడవ సముద్రములో మాయమైపోయింది. ఆ చుట్టుప్రక్కల పల్లెవాడలలో పల్లెనాయకులందరూ అతనికోసం ఆ తీరమంతా గాలించారు. ఆ బాలకునికోసం పల్లెవాడలన్నీ గగ్గోలు పుట్టాయి.

పద్దమ్మ దుఃఖానికి మేరలు లేవు. ఆ లేతహృదయం చితికిపోయినట్లే అయింది. వారం రోజులకి పెన్నసముద్రంలో చేరే ప్రదేశానికి తెరచాప ఎత్తుకొని కొనవూపిరితో ధైర్యం చెడకుండా వచ్చి చేరుకున్నాడు బుచ్చి వెంకన్న. ఈ సంగతంతా చెప్పి కావలిలో వున్న ఒక అయ్యవారిని అడిగితే ఆయన బుచ్చివెంకన్న రోజులు మంచివి కావనీ, రెండేళ్ళ వరకూ బుచ్చి వెంకన్నకూ, పద్దమ్మకూ పెండ్లి చేయవద్దని సలహా యిచ్చాడు.

పద్దమ్మకు పదహారోయేట బుచ్చి వెంకన్నకు ఇరవయ్యో యేట వాళ్ళిద్దరకు పల్లెపాకలలో ఎన్నడూ ఎరుగని వేడుకలతో పెళ్ళి చేశారు. కెరటమూ కెరటమూ కలసిపోయినట్లు గాలీ గాలీ ఒరుసుకుపోయినట్లు, ఏరులో ఏరు సంగమించినట్లు వారి జీవితాలు కలిసినవి. రెండు తిమింగలములులా వారు ఉప్పొంగినారు. సముద్రాల ఈదులాడినారు. రెండు కృష్ణ డేగలలా వారు మైమరపులతో ఆకాశాల తేలిపోయినారు!

ఇంతలో ప్రపంచపు బ్రతుకు మార్గాల జటలమారెమ్మ, ఠాకినీదేవి యుద్ధము అవతరించింది. జపాను యుద్ధరంగంలోకి దిగింది. భారతీయ యువకులెంతమందో కడుపుకోసం యుద్ధంలోకి జేరేరు. ఎంతమందో సరదాకోసం యూనిఫారము వేసికొన్నారు. చాలామంది ఏ సంగతీ తెలియకుండా మాయమాటలు నమ్మి సైన్యాల జట్టులలో జేరిపోయినారు. అలాగే యుద్దములోకి వెళ్ళిపోయినాడు బుచ్చి వెంకన్న. తాను పద్మ కోసమే యుద్ధానికి వెళ్ళ నిశ్చయించాడు. వెళ్ళాడు.

చేరిన ఆరునెలల్లో కోహీమా రంగానికి వెళ్ళవలసి వచ్చింది. మరి ఆరునెలలు తిరక్కుండా యుద్ధం ఆగిపోయింది. టకటక సైనిక వేషంలో జేబునిండా డబ్బుతో సంచులనిండా చిత్ర విచిత్రమైన వస్తువులతో, సువాసన నూనెలతో, రంగు రంగుల సబ్బులతో, ఫేసుపౌడర్లతో, దిబ్బనతో లోలకులతో అనేకరకాల వెన్నెలలాంటి చీరలతో యింటికి వచ్చాడు బుచ్చి వెంకట్రావు జమాదారు.

4

తన పల్లెలో తన వాళ్ళతో ఉండడానికి యిష్టంలేక పోయింది బుచ్చి వెంకట్రావుకు. వచ్చి కావలిలో మకాము పెట్టాడు. తాను చేపల వర్తకము ప్రారంభించాడు. పెళ్ళానికీ తనకూ చదువు చెప్పడానికి ఒక మేష్టర్ని పెట్టుకున్నాడు. పెళ్ళాన్ని పద్మావతీ అని పిలిచాడు. తాను బుచ్చి వెంకట్రావయినాడు! పద్మావతి కంఠం ఎంత మధురమైనది? ఆమె చిన్నతనంలోనే

“ఏడుకలూ పెళ్ళి ఏడుకలూ

భూమంత పందిరేసి

పువ్వుల తోరణాలు

అడివి బాపిరాజు రచనలు - 7

99

జాజిమల్లి(సాంఘిక నవల)