పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నరసయ్యగారు ఒకరు. గురజాడ అప్పారావు కన్యాశుల్క నాటక సమీక్షలో, వేదం వేంకటరాయశాస్త్రి పాత్రోచిత భాషను మెచ్చుకొంటూ చేసిన ప్రతాపరుద్రీయ నాటక సమీక్షలో ఈ వ్యావహారిక భాషా పక్షపాతం కన్పడుతుంది. కేవలం భాషావిషయమైనా, ప్రగతిశీల ధోరణే కాకుండా, ప్రజాసమస్యలపై ఆయన పత్రికల ద్వారా నిర్వహించిన కృషి అనన్య సాధ్యమనిపిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం పట్ల తొలితరం పత్రికా రచయితలలో ఉన్న అనుకూల వైఖరిని, తరువాత కాలంలో అనుభవంకొద్దీ, పరిస్థితుల ప్రభావంలో మార్చుకొని రాజకీయంగా చైతన్యం ప్రోది చేయటంతో పాటు, ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కారం సాధించటంలో ఆయన ప్రదర్శించిన పట్టుదల, ఆసక్తి ఏనాటి జర్నలిస్టుకైనా ఆదర్శప్రాయమే.

తెలుగువాడుగా పుట్టి ఇంగ్లీషు పత్రికల్లో పెద్దపేరు తెచ్చుకొన్న వారెందరో ఉన్నారు - అదీ తర్వాతికాలంలో. తొలిదశలోనే ఇంగ్లీషుపత్రికా ప్రపంచంలో తెలుగు'వాడి' రుచి చూపించిన ప్రశస్తి నరసయ్యగారిది. అవసరమైనపుడు తీక్షణత, అనుకూలతనుబట్టి సంయమనం, ఎట్టి పరిస్థితిలోనూ రాజీపడని నిష్కర్ష ఇవి ఏ క్రూసేడింగ్' జర్నలిస్టుకైనా కావలసినవి. ఈ ప్రమాణాలతో, అననుకూల పరిస్థితులలో తన ఆశయసాధన కోసం పత్రికను నమ్ముకొన్న ప్రజాపక్షపాత పత్రికారచయితలకు ఆద్యుడుగా, తరగని స్ఫూర్తిగా నిలిచిన నరసయ్యగారికి నివాళి.

నరసయ్యగారికి వెంకటగిరి జమీందారుతో సన్నిహిత సంబంధాలు ఉన్నా, కోడూరు గ్రామం కేంద్రంగా చేసుకొని జమీందారి గ్రామాల పరిస్థితులను, అక్కడి రైతుల, ప్రజల పరిస్థితులను ఆయన తన పత్రికద్వారా వివరించి తర్వాతకాలంలో ప్రారంభమైన జమీందారి రైతులపోరాటానికి పటిష్టమైన భూమిక ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఉద్యమపత్రికలకు శ్రీకారం చుట్టిన ఖ్యాతి ఆయనకే చెందుతుంది. ఇన్ని విధాల కృషి చేసిన నరసయ్యగారి చరిత్ర సమగ్రంగా రాని లోటు ఇప్పటికి కొంతవరకు తీరింది. రేఖామాత్రంగా బంగోరె, గోపాలకృష్ణ జమీన్ రైతు ద్వారా చూపిన ఆకరాలను, ఆధారాలను శోధించి, వివరాలను వెదికి పట్టుకొని, విశేష శ్రమకోర్చి ఏ యూనివర్శిటీ యో, అకాడమీయో నిర్వహించవలసిన కార్యభారాన్ని తనపై వేసుకొని నరసయ్యగారి జీవితచరిత్రను అందించటంలో పరిశోధకరచయిత డాక్టర్ పురుషోత్తంగారి కృషి సమాదరణీయమైనది. ఆయనకు తెలుగు పత్రికాలోకం ఇందుకెంతైనా రుణపడి ఉంటుంది. అలనాటి మంచి పత్రికారచయితను ఈనాటివారికి పరిచయం చేస్తూ, వెలువరిస్తున్న ఈ పుస్తకానికి ఈ రెండు మాటలు అభినందన పూర్వకంగా చెప్పడం జర్నలిస్టుగా సార్ధకత, సంతృప్తి.

21-12-2006 చక్రవర్తుల రాఘవాచారి విజయవాడ