పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిచయం

విలక్షణ సంపాదకుడు, విశిష్ట పత్రికారచయిత దంపూరు నరసయ్యగారి జీవితం, కృషిని వివరిస్తూ వెలువరించిన ఈ పుస్తకం చారిత్రక ప్రాధాన్యం కలది; సాంఘిక ప్రయోజనం కలది. ఇరవయ్యవ శతాబ్దపు తొలిదశకంలో వారు అనేక కష్టనష్టాలకోర్చి నిర్వహించిన ఆంధ్రభాషా గ్రామవర్తమాని ఇప్పటికీ ప్రజానుకూల పత్రికల ఒరవడికి ఆదర్శమని చెప్పవచ్చు.

నరసయ్యగారు మద్రాసులో పచ్చెయ్యప్ప ఉన్నతపాఠశాలలో అధ్యాపకులుగా ఉన్నపుడు రెండు సంవత్సరాలు 'నేటివ్ అడ్వొకేట్'ను, నెల్లూరులో ప్రభుత్వోద్యోగిగా ఉన్నపుడు సంవత్సరం పాటు 'నెల్లూరు పయొనీర్'ను నిర్వహించిన అనుభవంతో 'పీపుల్స్ ఫ్రెండ్'ను 1881లో ఆరంభించి పదిహేడు సంవత్సరాలు జయప్రదంగా నిర్వహించారు. పీపుల్స్ ఫ్రెండ్ అను సమాసమే కేవలం ఆలంకారిక విశేషణంగా కాక, పత్రిక ప్రజల కనుకూలమైన పాత్ర నిర్వహించవలసిన పరమార్థాన్ని శీర్షిక ద్వారా నిర్వచించటం అర్ధవంతమైన సూచనగా భావించవచ్చు. ఇటీవల 'పీపుల్స్' అనే విశేషణ పూర్వపద మైనవన్నీ పురోగామిశీలమైనవే కదా!

అప్పుడప్పుడే దేశంలో జాతీయోద్యమ ఆవిర్భావానికి ప్రయత్నాలు జరుగుతున్న కాలం. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానంతరం, బ్రిటిష్ ప్రభుత్వం వ్యూహం కొద్దీ ప్రారంభించిన పరిమిత సంస్కరణల ప్రభావం ఇంగ్లీషు విద్యావంతులైన మధ్యతరగతి వారి మీద బాగా ప్రసరిస్తున్న రోజులవి. రిప్పన్ ప్రభువు స్థానిక కౌన్సిళ్లకు నాంది పలికిన సమకాలీన స్ఫూర్తితో పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభం కావటం యాదృచ్చికమే అవచ్చు కానీ, ఆ పత్రిక తర్వాత సంవత్సరాల చరిత్ర నరసయ్యగారి సంస్కరణాభిలాషను, జాతీయ అభినివేశాన్నీ, ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న ప్రగాఢమైన అవగాహన, సానుభూతినీ ప్రస్పుటంగా తెలియజేస్తుంది.

ఆనాటి పత్రికల్లో సాంఘికసంస్కరణ, భాషా సంస్కరణల ప్రస్తావనలు బహుళంగా ఉండటం ఆశ్చర్యం కలిగించదు. సంఘసంస్కరణకు నిబద్దులైన నరసయ్యగారు హిందూ సమాజంలో రావలసిన అనేక సంస్కరణలపై తాము నడిపిన పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక ద్వారా విశేషమైన కృషి చేశారు. బ్రహ్మసమాజపు ప్రభావంలో ఆయన చేసిన కృషికి “లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్” తిరుగులేని తార్కాణం. సంస్కరణలో ఆయనది వెనుచూపు లేని దృక్కోణం. వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రభృతుల కృషికి ఆనాటి ఛాందసవర్గాల వ్యతిరేకతను సరకుచేయకుండా పత్రిక ద్వారాను, ప్రత్యక్షంగాను దోహదమొనర్చిన కర్మవీరుడు.

తెలుగు వ్యావహారిక భాషావాదంపై పెద్ద ఎత్తున గ్రాంథికవాదుల దాడి జరుగుతున్న రోజుల్లో నిర్భయంగా, నిజాయితీగా వాడుకభాషను సమర్ధించిన ప్రముఖుల్లో