పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృతజ్ఞతలు

ఈ పుస్తకం పాఠకుల ముందు ఉంచుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

తమిళనాడు ఆర్కైవ్స్ చెన్నై, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ - హైదరాబాదు, తిరుపతి కార్యాలయాల్లో, నెల్లూరు కలెక్టరాఫీసులో ఈ రచనకు అవసరమైన విషయాలు సేకరించాను.

ఆర్. సుందరలింగం పరిశోధన గ్రంథం “పాలిటిక్స్ అండ్ నేషనలిస్ట్ అవేకనింగ్ ఇన్ సౌత్ ఇండియా 1852-1891 నుంచి పందొమ్మిదో శతాబ్ది మద్రాసు సామాజిక పరిస్థితులను గ్రహించాను.

గురజాడ ఇంగ్లీషు రచనలు తెలుగు అనువాదాల రూపంలో తప్ప మాతృకలు చదివి ఆనందించడానికి అవకాశంలేని దురదృష్టకర పరిస్థితి కల్పించబడింది. నరసయ్యకు అటువంటి దుస్థితి ఏర్పడకుండా ఆయన రాసిన ముఖ్యమైన వ్యాసాలు, ఆయన అందుకొన్న ఉత్తరాలు, ఆయన పత్రిక మీద ప్రభుత్వ అనువాదకులు రాసిన రిపోర్టులు అనుబంధంలో చేర్చాను.

ఈ పుస్తకంలో అవసరాల సూర్యారావు, బంగోరె మొదలైనవారి రచనల నుంచి ఉదాహరించినపుడు వారు వాడిన భాషను మార్పుచేయకుండా ఉంచాను.

నా ఆత్మీయమిత్రులు శ్రీ పెన్నేపల్లి గోపాలకృష్ణ, డాక్టర్ ఎం. శివరామ ప్రసాద్ ఈ కృషిలో అండగా ఉన్నారు. మా బావ శ్రీ పి.ఎల్.ఎన్. ప్రకాశం ప్రూఫులు చూసే బాధ్యత స్వీకరించాడు. ఈ పరిశోధనకోసం, ఈ పుస్తక ప్రచురణకోసం నరసయ్య మనుమలు స్వర్గీయ నరసింహకృష్ణమూర్తి సంతానం పదిహేను వేల రూపాయలు ఇచ్చి సహాయపడ్డారు.

పెద్దలు, సీనియర్ పాత్రికేయులు, విశాలాంధ్ర దినపత్రిక పూర్వసంపాదకులు శ్రీ చక్రవర్తుల రాఘవాచారిగారు నా అభ్యర్థనను మన్నించి పరిచయ వాక్యాలు రాసి ఆదరించారు.

అందరికి అభివందనాలు.

నెల్లూరు 1-1-2007

కాళిదాసు పురుషోత్తం