పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

31


హిందువుల పాలిట శాపంగా మారింది. హిందువుల నాగరికత చలనం లేకుండా ఉండడానికి ఇదే కారణం. విజ్ఞానం వ్యాప్తి చెందుతున్న ఈ రోజుల్లో అనాదిగా కొనసాగుతున్న అపోహలను, పక్షపాతంతో కూడిన ప్రమాదకరమైన భావాలను హిందువులు వదిలించుకొంటున్నారు. హిందువుల అభివృద్ధిపథంలో అడ్డుగానిలిచిన ఇటువంటి విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ దురాచారాలలో బాల్య వివాహాలు తక్కువైనవేమీ కావు. ప్రజలు వీటిని పాటించడం వల్ల, అనేక సంక్లిష్ట సామాజిక దురన్యాయాల పాల పడుతున్నారు. వీటిని గురించిన మా పరిశీలన వివరించడానికి ఇప్పుడు వ్యవధి లేదు, అవకాశమూ లేదు. బాల్య వివాహాలవల్ల కలిగే దురన్యాయాన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాము. ఈ సాంఘిక దురాచారం ఇతరజాతుల వారిలోకన్నా హిందువులలో తక్కువ కీడు కలిగించేది కాదు. బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహ నిషేధం ప్రమాదకరమైన ఈ రెండు దుష్టసంప్రదాయాలు పెద్దఎత్తున బహిరంగ వ్యభిచారానికి కారణమయ్యాయి. “మా వాదనలో పసలేదు. ఇదేమి అంత పెద్ద విషయం కాదు. దీన్ని మీరు పెద్దదిచేసి భూతద్దంలో చూపుతున్నారు” అని మా మిత్రులంటారు. ప్రజల అనుభవం ఈ నిజాన్ని ధ్రువీకరిస్తూంది. సహజంగా ఇటువంటి ఫలితంతప్ప, మరొకదాన్ని ఊహించలేము. దీన్ని ఎత్తిచూపడం, దీనికి చికిత్స సూచించడం బాధాకరమైన మా కర్తవ్యం అయింది. ఈ దేశంలో మహిళల సాంఘిక, నైతిక ఉన్నతిని హృదయంలో అభిలషించే ప్రతి హిందువు రంగనాథశాస్త్రి, ఆయన స్నేహితులతో చేయి కలపాలి. వ్యవహారం నుంచి తొలగిన మనుధర్మంగానీ, మరొక ధర్మంగానీ ఏంచెప్తున్నదని కాక, ఇంతగా అభిలషించబడుతున్న సంస్కరణకు కార్యరూపం ఇవ్వాలి. పవిత్రమైన దాంపత్యసిద్ధిని కోరుకోవాలి. హిందువులు అపోహలను వదిలించుకొని తమకు తాము కొత్తగా ఆలోచించుకోవాలి.”

నాలుగో లేఖ

ఈ లేఖ మద్రాస్ టైమ్స్‌లో 1865 ఆగష్టు 19న వెంకన్నశాస్త్రి పేరు మీద ప్రచురించబడింది.

అనంతరామశాస్త్రి మద్రాసులో లేకపోవడంవల్ల బాల్యవివాహాలమీద చర్చ వాయిదా పడింది. ఈ సమయంలో వెంకన్నశాస్త్రి వాదం ఈ లేఖలో సమగ్రంగా వివరించబడింది. “అనంతరామశాస్త్రికి వ్యతిరేకంగా కొరడా ఝళిపిస్తాను. ఆయనతో ఢీకొని నా వాదాన్ని వినిపించడానికి సిద్దంగా ఉన్నాను” అంటూ లేఖ ఆరంభమవుతుంది. కరపత్రం రాయడం పూర్తికాకపోవడం వల్ల, వెంకన్నశాస్త్రి అభిప్రాయాలు ముందుగా లేఖలో వివరించబడ్డాయి. తన మొదటి లేఖలో అనంతరామశాస్త్రి పుస్తకంలో కొన్ని అప్రధానమైన అంశాలకు సమాధానం చెప్పడానికి అవకాశం లేకపోవడంవల్ల, ఈ లేఖలో వాటిని ప్రస్తావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ లేఖలో ప్రధానాంశాలు సంగ్రహంగా ఇక్కడ పేర్కొనడం జరిగింది.