పుట:Dvipada-basavapuraanamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xlvi

గారలు రచించిన పీఠికలలోను , వ్యాసములలోను, గ్రంథములలోను వివరముగాఁ గాంచవచ్చును.

బసవపురాణ ప్రాశస్త్యము :

వీరశైవ ప్రథమ పురాణ మైన యీ బసవపురాణము కర్ణాటాంధ్ర సాహిత్యములపై బలమైన ప్రభావము వైచినది. దానికి మతముకంటె సోమనాథుని కవిత్వమే ముఖ్యకారణ మనుట సత్యదూరము కాదు. కర్ణాటదేశమున నీ గ్రంథమును బవిత్రమత గ్రంథముగా భావించి పారాయణ చేయుచుండిరి. ఇందలి కథ లనేకము లా సాహిత్యమునఁ బ్రబంధములుగా రూపొందినవి. భీమకవి (క్రీ. శ. 1369) షట్పదివృత్తములలో మూలానుసారముగా దీనిని గన్నడమున ననువదించెను. ఆ తరువాత క్రీ. శ. 1500 ప్రాంతమున సింగిరాజనుకవి మహా బసవరాజ చరిత (సింగరాజపురాణ) మను పేరను, వృషభాంకకవి (క్రీ.శ .1655) బసవరాజ విజయ (చంపువు) (వషభేంద్ర విజయ) మను పేరను అనువదించియుండిరి. ఇంకను పెక్కు రీకృతినిఁ గీర్తించి యుండిరి. తమిళము నందును బసవపురాణానువాదము వెలసెనఁట !

ఆంధ్రమునఁ బిడుపర్తి సోమనాథుని పద్యానువాదము మొదట పేర్కొనఁ దగినది. అది సోమనాథునకే అంకిత మైనది. ఇదికాక బెజవాడ వాస్తవ్యుఁడును శ్రీపతి పండితారాధ్య వంశ్యుఁడును నగు మహాదేవారాధ్యుఁ డొక యనువాద మొనర్చెను (అముద్రితము). నాగారాధ్యుఁడును తుమ్ములపల్లి నాగభూషణ కవియు బసవవిజయ మను పేర బసవని చరిత్రములను రచించిరి. ద్విపదలుగా యక్షగానములుగా నింకను బెక్కండ్రు తెలుఁగున నీ పురాణమును , తత్కథలను వర్ణించియుండిరి. హరవిలాసమున శ్రీనాథుఁడు సిరియాళునికథను గైకొని యుండుట ప్రసిద్ధముకదా ! ఏలూరులో నారాధ్యబ్రాహ్మణు లగు కందుకూరి వారి పూర్వులెవ్వరో సోమనాథుని బసవపురాణమును స్కంథాగస్త్య సంవాద రూపమున నగస్త్యప్రోక్తముగా సంస్కృతమున రచించిరి. (అముద్రితము). శంకరకవి యను నాతఁడు సంస్కృత బసవపురాణము రచించె నని కర్ణాటకవి చరిత్రము చెప్పుచున్నది. బసవపురాణమువలెనే సోమనాథుని పండితారాధ్య చరిత్రయు వాసికెక్కినది. శ్రీనాథుఁడు దీనిని పద్యకృతిగా రచించెను. నాగులూరి శేషనారాధ్యుఁడు పర్వతప్రకరణమునకుఁ బద్యానువాదము సంతరించెను. దీనినిబట్టి చూచినచో సోముని కృతులలో బసవపురాణమున కెనలేని ప్రతిష్ఠ సాహిత్యజగత్తునఁ గలదని దెలియుచున్నది.

ఇతనిని చెన్నలూరి బసవపురాణకర్త అత్తలూరి పాపయామాత్యుఁడు “వరసర్వజ్ఞశిఖామణి " యనియు, పిడుపర్తి సోమనాథుఁడు "జైనమస్తకవి న్యస్త శాతశూల కలిత బిజ్జల తలగుండు గండ బిరుద శోభితుఁ డనియుఁ,"