పుట:Dvipada-basavapuraanamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xlv

“తొలికోడి కను విచ్చి నిలిచి మై వెంచి
 జలజల రెక్కలు సడలించి నీల్గి
 గ్రక్కువఁ గాలార్చి కంఠంబు విచ్చి
 ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు
 నిక్కించి, మెడసాచి, నిక్కి ముస్సూచి
 కొక్కొరో కుర్రని కూయక మున్న”— (పండితారాధ్య చరిత్రము)

బసవపురాణ పండితారాధ్య చరిత్రలలోని ద్విపదలలో పురాణశైలి సరళముగను, చరిత్రశైలి ప్రౌడముగను గానవచ్చును . వస్తుగౌరవమును బట్టి సుదీర్ఘ సంస్కృత సమాసభూయిష్ఠ మైన రచనము నాతఁడు చరిత్రలో చేసెను. ప్రాసవళ్లను గూడ పండితారాధ్య చరిత్రలో నెక్కువ వాడినాఁ డనియు, నై నను మితిమీరి పోలేదనియు, అతఁడు రచించిన ముప్పదిరెండు వేలకు పైఁబడిన ద్విపద పంక్తులలో నించుమించు నిన్నూరింటిలో మాత్రమే ప్రాసయతిని వాడి నాఁడనియు, నందును బసవపురాణమునఁ జాలతక్కువ వాడె ననియు చిలుకూరి నారాయణరావుగారు పేర్కొనియుండిరి. సోమనాథుఁడు బసవపురాణమున కంటె పండితారాధ్య చరిత్రమున ద్విపదను బహుభంగులలో, గతి విశేషములతో నడిపించి యుండెను. మొత్తమునకు ద్విపదచ్ఛందమునకు సోమనాథుఁడు కావ్యమునఁ బట్టము గట్టి దేశి సంప్రదాయమునకుఁ దెనుఁగున ఘంటాపథము వై చిన గౌరవము గడించినాఁడు !

సోముని కందములు మాకందములవలె తిక్కన కందములను బోలి యున్నవి. సీసములు సమతాగుణముతో నైన యొక తూగును గడించి యే పాదమున కాపదము విఱుగుచు శ్రీనాథాదుల సీస రచనలకు మార్గదర్శకము లైనవి. ఇతఁడు ప్రయోగించిన ముక్తపదగ్రస్తాదులు పోతనాదుల నాకర్షించినవి. పోతన గారి "మందారమకరంద" అను సీసపద్యమునకుఁ త్రోవ జూపిన సీసము చతుర్వేదసారమునఁ గలదు. ఇతని రచనలపై పండితత్రయ ప్రభావమును, ఆంధ్రభారత ప్రభావమును కలదు. అనుభవసారముపై శివతత్త్వసార ప్రభావము సుస్పష్టము, “వై దికు లిది శుద్ధవైదికం బని యన" అను సీసపద్యముపై (చతుర్వేదసారము 23) నన్నయగారి “ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని" అను పద్య (ఆదిప. 1-31) ము యొక్క ప్రభావము తేటతెల్లము. తెలుఁగు నుడికారమును, వ్యవహారమున నున్న దేశ్యపదములను తన రచనయం దపరిమితముగాఁ జేర్చుటచే నీతఁడు తెలుఁగున కెనలేని సేవ చేసినవాఁ డయ్యెను.

సోమనాథుని కావ్యములందలి ఛందోభాషా వ్యాకరణాది విశేషములను బేర్కొనవలె నన్నచో నదియొక గ్రంథము కాఁగలదు. ఈ యంశములను వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, చిలుకూరి నారాయణరావుగారు, బండారు తమ్మయ్య