పుట:Dvipada-basavapuraanamu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

109

పోనూకి తెచ్చిన పుక్కిటి నీట
మానుగా శివునకు మజ్జనం బార్చి,
పఱికి వెండ్రుకలపైఁ బత్తిరి రాల్చి,
మఱి దొప్పఁ దెచ్చిన మాంస మర్పించి
యనయంబు నట్లు గన్నప్ప దేవుండు
ననురాగమునఁ గొల్వ, ముసు గొల్చుతపసి
యేతెంచి యప్పరమేశ్వరు మ్రోల
నీతెఱంగంతయు నేర్పడఁ జూచి
"యెక్కడి మ్లేచ్ఛుఁడో యెన్నఁటిఁగోలె
నిక్కడ నన్యాయ్య మిట్లు సేసెడిని 890
నేమి సేయుదు" నంచు నేవగింపుచును
నామాంస ఖండంబు లటు వాఱనూకి.
యపవిత్ర మయ్యె శివాగార మనుచుఁ
దపసి పంచామృతస్నపనంబు సేసి
పాదోదకములు దత్ప్రాంతంబునందు
వేదోక్తముగఁ జల్లి వెండి పూజించి,
వేగుండి యాతనివిధ మెల్ల నరసి
వేగినఁ దపసి యుద్వృప్తిమై వచ్చి
‘‘యక్కటా ! యెంగిలి యదియు మాంసంబు
పుక్కిటినీరును బూజ్యమే పూజ; 900
చెప్పుఁగాలను సూకు శివభక్తి గలదె ?
యెప్పాట వినఁబడునే ? యెట్లు సైఁప
వసుధ మృగాదుండు వాఁడు ; నేఁ దపసి,
నసమానవిగ్రహం బన నెట్లువచ్చు ?
నిచ్చటఁ దొల్లియు నేనుంగుతోడఁ
జెచ్చెరఁ బోరదే చెలఁది : యె ట్లనిన :
హరుఁ డెండఁ గాలెడి ననుచు నచ్చెలఁది
పరువడిఁ దననూలు దెరచీరభాతిఁ
దిరిగివచ్చిన వృక్ష తృణగుల్మలతలఁ