పుట:Dvipada-Bagavathamu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్యాణకాండము

197

నఱికినక్రియ భీషణస్ఫూర్తి మెఱయఁ
గటక కేయూరకంకణహేతిరుచులఁ
బటుతరంబుగ బాణుబాహులు నఱుకఁ
గని నీలకంఠుఁడు కమలాక్షు కడకుఁ
జనుదెంచి భక్తవాత్సల్యతఁ బలికె
“విశ్వజగన్నాథ! విశ్వరూపాఖ్య!
విశ్వవిశ్వంభర! విశ్వసంహార!
వేదాంగవాహన! వేదాంతవేద్య!
వేదగోచర! సర్వవేదాంతకృష్ణ!
అవని భారముమాన్ప ససురాళిఁ దునుమ
నవతరించినవాఁడ వంభోజనయన!1010
నీవాదిమూర్తివి నిఖిలమూర్తులును
నీవెకాకొండక నెఱిఁజూపగలడె?
బాహాసురుఁడు నాకు భక్తుఁడు వీని
బాహులన్నియుఁదుంప బంతంబుగాదు.
ననుగృపఁజూచి మన్నన నాల్గుచేతు
లునుపవే” యనుటయు నుగ్రాక్షుఁజూచి
గరుడుని డిగి వచ్చి కరకంఠుకేలుఁ
గరములఁ గీలించి కమలాక్షుఁడనియె.
“నీ భక్తుఁడననేల? నిగిడియే ప్రొద్దు
మాభక్తుఁ డీతడు మాప్రాఁతవాఁడు
మాన్యుఁడు ప్రహ్లాదు మనుమని కొడుకు
ధన్యాత్ముఁడగు బలితనయుఁడు గాన
నీతని కరుణించి యిచ్చితినాల్గు
చేతులు; నినుపూజ సేసెడికొఱకు