పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు147


పువ్వులను చూచుచున్నప్పుడు నాకు పూర్వపు బెంగుళూరి పుష్పవనస్థ చంపక వృక్షచ్చాయలు స్మృతికి వచ్చును. గుంపులు గట్టి వందలకొలదిగ బాలబాలికలు విద్యాసక్తులై, నవ్వుచు, ప్రేలుచు వికసించిన పువ్వులవంటి ముఖబింబములతో నాకు కన్పించగనే, వివిధ పుప్ప శోభితమై, శుక శారికా కలకలముతో కూడినదై నన్నానందమున మంచి తేల్చుచుండిన నా బెంగుళూరి పుష్పవనమున నున్నట్లే అనిపించి, మరల ఆనందించు చుందును.

ఆ పూవుతోటను ఏ శ్రద్ధాభక్తులతో పెంచి పెద్దచేసితినో, అట్టి శ్రద్ధాభక్తులతోనే ఈ విద్యావనమును పెంచి పెద్దదిగా నొనర్చుటకు ఈశ్వరుడు నన్ను అనుగ్రహించి అనుకూలించుగాక! ఈ విద్యావనము బెంగుళూరి వనము కన్న శాశ్వతమైనది కదా! ఇందు విద్యాగంధముతో వికసించు కిశోర హృదయములు, వాడనిపూలు; వాసన తరుగని పూలు; లోకకల్యాణప్రదములు.