పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమతరంగము

33

ణయమను ప్రబంధము రచించెను. ఆగ్రంథమును వినుపించునాటికిఁ బలువురు పండితులు, కవులు కృష్ణకవిచేతను, రాజుగారిచేతను నాహ్వానింపఁబడిరి. రాజుగారు మనలక్ష్మణకవికిఁగూడ నాహ్వానపత్రిక నంపవలసినదిని చెప్పినను కృష్ణకవి యట్లొనర్పలేదు సరేకదా, పైగా “పెండ్లిపందిళ్ళసంభవనకుఁ బోఁదగిన లక్ష్మణకవి యీపండితసభకు రాఁదగునా” యని అధిక్షేపించెను. అందునకు జమీన్దారుగారు మిన్నకుండిరి.

తరువాత, కృష్ణకవి తనవిషయమై రాజుసన్నిధి జరిపిన వృత్తాంతమంతయు నెఱింగి కవికి లోఁగి రాజు తన్నుఁ బిలువకపోయినను దప్పక యాసభకుఁ బోయి కృష్ణకవిగర్వ మడంపవలయునని లక్ష్మణకవి సభజరుగునాఁటికి రామచంద్రపురమునకు వచ్చెను. ఆసంగతి నెఱింగి రాజుగారు లక్ష్మణకవి నిప్పుడైన నాహ్వానింపవలె ననఁగా, “తనయూరునుండి యింతదూరము వచ్చినవాఁ డిఁక సభకు రాలేకపోవునా? ఇఁక మనము పిలువనేల?” అని కృష్ణకవి వారించెను. ఆసంగతి నెఱింగి లక్ష్మణకవి తనంతఁదానే సభకు వచ్చెను. రాజుగారు మిగులమర్యాదఁజేసి యున్నతాసన మొసంగి “అయ్యా! మీరును సమయమునకు వచ్చినారు. నాకు మిగులసంతసమైనది. ప్రస్తుతగ్రంథమును విని గుణదోషములఁ బరిశీలించి మాకుఁ గృతియిప్పింపుఁ” డని వినయముగా నడిగెను. అదివిని లక్ష్మణకవి వైముఖ్యమును సూచించుచు “మహాపండితులగు కృష్ణకవిగారు రచించిన గ్రంథమును బరిశీలింపఁగలవాఁడనా? నలువురితోఁ బాటు వినుచుం గూర్చుండెద” నని మాఱుపలికెను.