పుట:Chanpuramayanam018866mbp.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

చంపూరామాయణము


గులుకం బలికిన విని యాసారావలంబిని యైనకాదంబిని ఘర్మోద్వేగిని యైనకేకినింబలె సరమ కర మాశ్వాసించె నంత.

52


చ.

మతిగలమాల్యవంతుఁ డనుమంత్రి త్యజింపుము సీత నన్నచో
నతికుపితాత్ముఁ డౌనలదశాస్యుఁడు వాని లఘూకరించి తా
నతనుభుజప్రతాపయుతుఁ డౌటను దోన బహూకరించె స
మ్మతి నలయప్సరోయువతీమండలము న్నవమాల్యవంతమున్.

53


వ.

అంత ననంతకల్యాణగుణాభిరాముం డగురాముండు కామరూపవిభీషణామాత్యవిదితరక్షోనగరరక్షోదంతుండును, హృదంతరోపజాతసమరసంరంభుండును నై, యంభోధిమేఖలాలంకారలంకాద్వారస్థుం డగుప్రహస్తునకుఁ బర్యస్తాహితప్రాణానిలతాభీలుని నీలుని, దక్షిణద్వారరక్షణదక్షు లగుమహెూదరమహాపార్శ్వులకు విశ్వత్రయవిజయధౌరేయుఁ దారేయునిఁ, బ్రత్యగ్ద్వారపాలనఖేలనామోదుం డగుమేఘనాదున కవక్రపరాక్రమశ్రీమంతు హనుమంతుని, నంతర్వ్యూహవిహితరక్షుం డగువిరూపాక్షునకు రక్షఃప్లవగఋక్షధ్యక్షులఁ బ్రతినిధులం గావించి యధిజ్యకోదండమండితభుజాదండుం డై తమ్ముండునుం దానును సమరాభిముఖదశముఖగుప్తోత్తరగోపురద్వారంబును నంతరంగంబగు బలయూథంబుతో నుపరోధించిన.

54


క.

లంక న్దనుజులు ప్లవగా, తంకంబునకుం దలంకి తలువులు వేయన్
శంకింపర యమపురిఁ ద,త్కింకరు లప్పుడు బెడానఁ దెఱచిరి తలుపుల్.

55


వ.

తతక్షణంబ లక్ష్మణాగ్రజుఁడు సుగ్రీవసహితుం డై సువేలాద్రికూటంబు నధిరోహించి త్రికూటావనీభరచూడామణియును, సింహలద్వీపకమలకర్ణికయను, విశ్వకర్మనిర్మాణకౌశలంబును, నిశాచరకేసరినివేశదరియును, ననారతబందీకృతామరపురంధ్రీబాష్పనదీమాతృకోపవనసీమయును, నిరంతరసేవాసమాగతదిక్పాలకులమాతంగమదాంబుపంకిలబాహ్యాంగనోత్సంగియు నగు లంకం గనుంగొనుచు నందొక్కచోట సముత్తుంగసౌధంబున నధివసించి యున్నవాని సదేహబంధం బగునంధకారంబుచందంబునం దగువాని సేవాసమాగతసతారకవిభావరీవరోపమానానుచరోదస్తవిమలముక్తాతపత్రచ్ఛాయ నుండువాని వైమానికవధూవిధూయమానధవళచామరద్వంద్వశోభితుం డై యభితశ్చలితమందాకినీపరీవాహం బగునంజనశైలంబుకరణి రాణించువాని నిఖలజగద్విజయవర్ణావళీమతినిర్ణాయకానేకవివిధసమీకాభిఘాతమగ్నభుగ్నై