పుట:Chandrika-Parinayamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షించి యీచంద్రికాపరిణయకర్తయు పెక్కుసంబోధన లట్టి దీర్ఘసమాసయుక్తములైనవాటిని, కొన్ని చిన్నసమాసములతో నున్నవాటినిఁ జేసిరి. వానిలోఁ గొన్ని:

1. విరిగల్వకంటి=వికసించిన కలువలవంటి కన్నులు గలదానా!

2. నిశాకరసోదరదాస్య=చంద్రునికి సోదరునివలె నున్న, అనఁగా చంద్రునివలె నున్న ముఖము గలదానా! ఇచ్చటి ‘సోదర’శబ్దము ఇవార్థకము. (‘వలె’ నను నర్థము గలది). ‘దేశీయ దేశ్య రిప్వాభ సోదరాద్యా ఇవార్థకాః’ అని కవికల్పలత.

3. జలజాతచ్ఛదదేశ్యనేత్ర=తామరఱేకులవంటి కన్నులు గలదానా! ఇందలి దేశ్యశబ్దము సైతము ఇవార్థకము, లేదా ఈషదసమాప్త్యర్థకము.

4. పారిమాండల్యవన్మధ్య=పరమాణు పరిమాణము గల నడుము గలదానా! పారిమాండల్య మనఁగా తర్కశాస్త్రపరిభాషలో పరమాణువు (అణువు) అని యర్థము.

5. సరసీజోపమగంధి=పద్మగంధమువంటి శరీరపరిమళము గలదానా!

6. బంధురనూతన బంధుజీవబాంధవరదనాంశుకామణి=దట్టమై క్రొత్తదై యున్న జపాకుసుమమునకు సరిపోలిన యధరోష్ఠము గల కాంతలలో శ్రేష్ఠురాలా! ఇందలి బాంధవశబ్దము ఇవార్థకము. సగోత్ర, జ్ఞాతి, బంధు శబ్దములును ఇవార్థకములే.

7. సరససితోపమాధర=రసవంతమగు చక్కెరను బోలిన యధరోష్ఠము గలదానా!

8. తరుణచపలాయమానకైతవదళాప్తకబరికాబంధ=క్రొక్కారు మెఱుపువలెఁ గనబడుచున్న మొగలిఱేకుచేతఁ బొందఁబడిన కొప్పు గలదానా!