పుట:Chandrika-Parinayamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

‘నృపాలు చూపుదొమ్మరి’ – రాజుయొక్క చూపులనెడు దొమ్మరి. చక్కని రూపకసమాసము (ఆశ్వా3 ప.46).

‘నృపునేత్రములు’ – నృపునియొక్క నేత్రములు (ఆశ్వా3 ప.47). అచ్చపు తత్సమపద తత్పురుషసమాసము.

‘నవలా యేగినదారిఁ గాంచు’ (ఆశ్వా3 ప.96). ‘నవలా కలువకంటి నాతి గోతి’ యను నిఘంటువువలన స్త్రీపర్యాయముగా ‘నవలా’ పదము చక్కగాఁ బ్రయోగింపఁబడినది. ఇట్లు తెలుఁగు వ్యాకరణ,నిఘంటుజ్ఞానము పుష్కలముగా నుండుటచే నెన్నియో యచ్చతెలుఁగు పదములను, సంధులను, సమాసములను, చక్కని జాతీయములను జేర్చి తనయచ్ఛాంధ్రవిజ్ఞానవిశేషములను గోచరింపఁజేసినాఁడు.

తర్కశాస్త్రప్రవీణత

మ. ధరణిన్ మాధవరాయ! తావక బలోద్యద్రేణుపాళి కృతో
ద్ధుర భావత్క మహోగ్నిబుద్ధి ప్రమయై తోఁపంగ, నాన్వీక్షకీ
వరు లవ్యాప్తము ధూళి తద్బలమునన్ బాటిల్లు ధూమధ్వజా
కరధీ యప్రమ యంచు నెంచుట లిఁకన్ గైకొందురే? యెంతయున్.

(ఆశ్వాప్రథ, ప.72)

‘పర్వతో వహ్నిమాన్ ధూమాత్’ (పొగ కనపడుచుండుటవలన ఈపర్వతమునం దగ్ని యున్నది) అను నగ్నిజ్ఞానము, ‘యత్ర ధూమ స్తత్రాగ్నిః’ (ఎచ్చట పొగ యుండునో అచ్చట నగ్ని యుండును) అను వ్యాప్తిజ్ఞానమువలనఁ గల్గును. ఇది తర్కశాస్త్రమునందలి యనుమానప్రమాణస్వరూపమును జెప్పుటలో నుపయోగించు పదజాలము. ప్రస్తుతపద్యమునందు బలోద్యద్రేణుపాళిని (సైన్యగమనముచేత రేఁగిన దుమ్మును) ధూమముగా రూపణము చేసి, దాని వ్యాప్తిజ్ఞానముచేత మాధవరాయల ప్రతాపాగ్ని ప్రమయై (యథార్థజ్ఞానమై) తోఁచుచున్నదని నిర్ణయము. ‘యత్ర యత్ర సైన్యగమనధూళిః తత్రతత్ర మాధవరాయ ప్రతాపాగ్నిః’ – సైన్యధూళి యున్నచోట మాధవరాయప్రతాపాగ్ని యుండు నన్న వ్యాప్తిజ్ఞానము,