పుట:Chandrika-Parinayamu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. ఈయెడఁ దమిస్ర నీదర్పమెల్లఁ గూల్చి
యరిభయదలీలఁ దనరు దీవ్యత్సుచంద్ర
శైత్యవత్కరకాండముల్ చక్కఁ గాంచి
త్రిదశబృందంబు లానందరేఖఁ జెందు. 130

చ. యతుల వధించి తత్కృతసవాళి హరించి ధరిత్రి ధార్ష్ట్యసం
గతిఁ దగునీవు నాయెదురుకట్టున నిల్చితిగా నిశాట త
త్కృతికి ఫలంబు నీ వెనయ నిత్తఱిఁ దార్చెద మద్భుజోగ్రధ
న్వతరుణభోగివాంతవిషవహ్నిసమానకలంబధారచేన్. 131

మాలిని. అని మనుజకులేంద్రుం డయ్యెడన్ భూరిబాణా
సన మెనసి శరాళిన్ జాల దైత్యేంద్రు నొంచెన్
ఘనము నగముపై నిష్ఖండవార్ధారచే నా
ఘనగుణరుతి గర్జాగౌరవం బూని మించన్. 132

చ. జనపతి వైచినట్టి శితసాయకముల్ నిజసాయకచ్ఛటన్
దునియఁగఁ జేసి దైత్యపతి తోడనె యమ్ములు కొన్ని గూర్చి వై
చినఁ గడుఁ జూర్ణతన్ గగనసీమను గప్పఁగ నాత్మబాణవ
ర్తన నెనయించెఁ జూచునజరప్రకరంబులు కేలఁ బాపఁగన్. 133

చ. అలపతి వైచు బాణముల నాదనుజేశుఁడు, వాఁడు వైచు న
మ్ముల హరిభేది తున్ముచు, నపూర్వరణం బొనరించి రయ్యెడన్
తలఁకక విల్లునన్ ఖగవితానము గూర్చుట వాని వైచుటల్
దెలియఁగ నోప కెంతయు మతిన్ సురసంతతి సన్నుతింపఁగన్. 134

ప్రహరణకలితవృత్తము
అభినవధృతి లోనడరఁగఁ బలభు
గ్విభుఁ డరిబలముల్ వెడలి నడవఁగన్
స్వభటనికర మెంచఁగఁ జటులగదన్
ప్రభుకులమణిపైఁ బఱపెను వడిగన్. 135