పుట:Chandrika-Parinayamu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తనయంగమహిమ నేత్రముల రాజిలఁ గళా
వ్యాప్తిఁ జూపట్టుప్రజాధినేత,
తనశోణరుచి మోవిఁ దగ జగమ్ములమ్రొక్కు
లంది చెల్వూనులోకైకబంధుఁ,

తే. డట్టి యీదిట్ట పతి యంచు నబ్జపాణి
యవనిభృన్నాయకకుమారి హంసయాన
పద్మినీమణి మానసపదవి మెచ్చ
సన్నుతింపఁ దరంబె భుజంగపతికి. 86

మ. గళపూగచ్ఛవి యబ్జకాండపరిసర్గం బూన్పఁ, గన్నుల్ గనన్
నలరూపంబులు పెంప, లేనగవు చంద్రశ్రేణుల న్మన్ప, ని
ర్మల మౌమోవి మధూత్కరంబు ఘటియింప, న్మించు నీభర్తతోఁ
దలఁపం జెల్లునె సాటి యౌ ననుచుఁ దద్రమ్యాంగసౌభాగ్యముల్. 87

చ. ఘనఖరతామిళద్విషమకాండసమున్నతహేతిజాతతా
పనికర మంతయుం గడకుఁ బాయఁగ నీసదధీశుపాదసే
వనగతి యేతదీయఘనవర్తనఁ గాంచక యున్నచోఁ గరం
బెనయదె నాదుశ్యామతనమెంతయు నుర్వి నిరర్థకత్వమున్. 88

చ. అని యనివార్యదోహదసమన్వితమానసవల్లియై, వినూ
తనచపలాతనూకులమతల్లి దలంచుచునుండునంతలో
వనిత యొకర్తు చేరి చెలువా నిను రమ్మనె నిప్డు వీణియన్
విన జనయిత్రి యన్న గురుని న్వినయంబునఁ గాంచెఁ గాంచినన్. 89

ఉ. కిన్నరకంఠి యీనృపతికి న్సతి వయ్యెదు నాదుమాట యా
సన్నశుభంబు పొమ్మనుచుఁ జక్కగ నంచినఁ దద్గురూక్తిచేఁ
గన్నియ యేగె మాతసముఖంబును గాంతలు వెంట రాఁగ ను
ద్యన్నవహీరపాదకటకార్భటి యంచల బుజ్జగింపఁగన్. 90