పుట:Chandrika-Parinayamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవి-కాలము

భారతదేశస్వాతంత్ర్యలబ్ధికిఁ బూర్వమునఁ బాశ్చాత్యుల పరిపాలనలో నుండిన యాంధ్రప్రాంతమందును, నిజాం పరిపాలనలో నుండిన తెలంగాణమునందును నిలిచియుండిన సంస్థానములు, జమీందారీలును జేసిన కళాపోషణము, సాహిత్యసేవయు మరువఁదగినవి కావు. తెలుఁగునాట వెలసిన దేవతావిగ్రహ, దేవాలయశిల్పములు, సంస్కృతాంధ్రకావ్యములు మొదలగు సంస్కృతిచిహ్నము లన్నియు శాతవాహన, విష్ణుకుండిన, కాకతీయ, చాళుక్యాదివంశములకుఁ జెందిన రాజులచేతను, రాణులచేతను, శ్రీకృష్ణదేవరాయ, అనవేలమహీపాల, సర్వజ్ఞసింగభూపాలాది ప్రభువులచేతను నిర్మింపఁబడి, ఈనాటి మన ఘనతకును, సంస్కృతికిని వన్నెలుదిద్దుచున్న విషయము సర్వజనవిదితము. వారిలో సర్వజ్ఞసింగభూపాలుని వంశమునకుఁ జెందినరాజు శ్రీ సురభి మాధవరాయలు.

చ. “వికలిత పంకజాత నవవిభ్రమమై, ఘన గోధ్ర తాభిభూ
త కమఠనాథమై, యరుణధామ విభాసితమై, ద్విజోత్తమ
ప్రకటిత హార్దయోగభర భావుకమై, ధరయందుఁ ‘బద్మనా
యక కుల’ముద్భవించె నట, నాత్మజనుష్పద తుల్యవైఖరిన్.”

అని చంద్రికాపరిణయ పీఠికాభాగమునందలి 18వ పద్యమున వర్ణింపఁబడిన పద్మనాయకకులమున (వెలమవారని ప్రసిద్ధినిఁ గన్న కులమున) వీరికి మూలపురుషుఁడైన పిల్లలమఱ్ఱి బేతాళనాయఁ డుద్భవించెను (ఈయన జన్మనామము చెవ్విరెడ్డి). కాకతీయ గణపతిదేవచక్రవర్తివద్ద సేనానాయకుఁడుగా నుండి కాకతీయసామ్రాజ్యమున కెనలేనిసేవఁ జేసిన యీ బేతాళనాయని వారిని, రేచర్లగోత్రమువా రందఱును – అనఁగా వేంకటగిరి, బొబ్బిలి, పిఠాపురం, జటప్రోలు, మైలవరం మొదలగు ముప్పదియాఱు (36) వంశములవారు తమ మూలపురుషునిగా భావించుచున్నారు. నేటికిని కొల్లాపురం (జటప్రోలు) వారు