పుట:Chandrika-Parinayamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శరన్నవరాత్రోత్సవసందర్భమున నీ బేతాళనాయనికి బలిని, పూజలను జరిపించుచున్నారు. ‘రేచర్ల’ యనునది బహుశ చెవ్విరెడ్డి జన్మస్థానమగు గ్రామము. దానినే వీరందఱు గోత్రనామముగా స్వీకరించి యుందురు. పల్నాటియుద్ధమున సుప్రసిద్ధుఁడైన రేచర్ల బ్రహ్మనాయఁడు ఈ బేతాళనాయని మనుమఁడు. బేతాళనాయనికి నల్లగొండమండలమునందలి రాచకొండ, దేవరకొండ గ్రామములు రాజధానీనగరములై యుండినవి. ఈతని వంశమునందు పదవతరమువాఁడు ‘సర్వజ్ఞ’బిరుదభూషితుఁడై, సాహిత్యక్షేత్రమున సుప్రసిద్ధుఁడై, శ్రీనాథాది మహాకవులను సత్కరించిన సింగభూపాలుఁడు. ‘రసార్ణవసుధాకరము’ (సింగభూపాలీయమను నామాంతరము గల అలంకారశాస్త్రగ్రంథము), సంగీతరత్నాకరవ్యాఖ్య, దీనికి సంగీతసుధాకరము అని పేరు, ఇది నిశ్శంకశార్ఙ్గదేవుని సంగీతరత్నాకరమునకుఁ గల వ్యాఖ్యలలో నుత్తమ మైనదని విద్వాంసులు మెచ్చుకొనిరి), “రత్నపాంచాలిక” (ఇది కువలయావలి యను నామాంతరము గల నాలుగంకముల నాటిక) యిప్పటికి లభించిన యితని కృతులు. ఈ రాజేంద్రుని కావ్యలక్షణములను మహామహోపాధ్యాయ మల్లినాథసూరి తన వ్యాఖ్యానములలోఁ బ్రమాణీకరించెను. ఈ సింగభూపాలునిఁ జంద్రికాపరిణయ మిట్లు ప్రశంసించినది.

సీ. “అరిపుర భేదనాయత దోర్బల స్ఫూర్తి
నవరాజవర్ధన వితత కీర్తి,
కనదహీనాంగద కలితబాహాలీల
ఖండితాహిత ఘనాఘన విహేల,
సద్గణరక్షణ క్షమ చరణాసక్తిఁ
బటుచంద్రకోటీరభా నిషక్తిఁ,
దత సర్వమంగళాంచిత గాత్ర రుచిపాళి
నచల ధర్మోన్నత ప్రచయకేళిఁ,
తే. బ్రకట దుర్గాధినాయకభావ భూతి
వైరి దర్పకదాంబక వహ్నిహేతి,
నవనిఁ బొగడొందె ‘సర్వజ్ఞుఁ’డనఁగ సింగ
ధరణిభృన్మౌళి తీవ్రప్రతాపహేళి.”