పుట:Chandragupta-Chakravarti.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

127


ఎనిమిదవది ఆచార్యులను, గురువులను, జ్యోతిష్కులను, వైద్యులను జూచుటకును వారి యాశీర్వాదముల నందుటకును వినియోగింపఁ బడుచుండెను.

ఈ విధముగ రాజుయొక్క.. దినచర్య నిర్ణీతమయి యుండెను, విశేషకార్యము లున్నపుడు రాజీ కాలక్రమమును మార్చుకొనుచుండె ననుటకు సందేహము లేదుగాని సర్యసాధారణముగ నియ్యది యతనిచే ననుసరింపఁబడుచుండెను.

"కార్యమున కెప్పుడును సిద్దముగనుండుటయె రాజునకు వ్రతము. ధర్మమును జక్కఁగ నెరవేర్చుటయె యజ్ఞకర్మ. ఎల్లరయెడ సమభావమునఁ బ్రవర్తించుటయె యాతనికినవభృధ స్నానము.”

"ప్రజలసౌఖ్యమే యతని సౌఖ్యము. వారి క్షేమమే యతని క్షేమము. తనకుఁ బ్రీతికరమగునది ప్రీతికరంబని యతఁడు తలఁపరాదు. ప్రజలకుఁ బ్రీతికరంబగునదియె నిశ్చయంబుగ ప్రీతికరంబని యతఁ డెన్నవలయు."

"రాజెల్లపుడును నప్రమత్తుఁడయి ధర్మములఁ దీర్పవలయును; అప్రమత్తతయె ఐశ్వర్యంబునకు మూలంబు. దాని వ్యతి రేకంబ దుఃఖమునకుఁ బునాది.”

అను నీ సూత్రంబులు చంద్రగుప్తుని జీవయాత్రకు మూలాధారములు. కావుననే రాముఁడుంబలె

"తండ్రి క్రియఁ" జంద్రగుప్తుఁడు

“దండ్రుల మఱపించి ప్రజలఁ దారక్షింపన్

“దండ్రుల నందఱు మఱచిరి

“తండ్రిగదా" చంద్రగుప్త “ధరణివుఁడనుచున్"