పుట:Chandamama 1947 07.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాఅమ్మ జ్యోతిలాగా వెలిగిపోతున్నది. మాఅమ్మకు ప్రక్కగా చూచాను. మా తాత ఎలావున్నాడని? చూడటానికి కళ్లు చాలకుండా ఉన్నాయి. నన్ను నేను చూచుకొన్నాను. నాఒళ్లు నాకే కనిపించలేదు.

నాకు పట్టరాని యేడుపు వచ్చింది. పోయినకాంతి ఎలా తిరిగి సంపాదించటం? ఆలోచించాను, ఏమీ పాలుపోలేదు. దిగాలుపడి కూర్చున్నాను. అప్పుడే ఆకాశంలో చుక్కమ్మ కిటికీ మిలమిల లాడింది. చప్పున ఒక ఉపాయం తోచింది. అక్కడనుంచి ఒక్క గంతులో పోయి చుక్కమ్మ ఇంటి తలుపు తట్టాను. ఆమె తలుపు తీయకుండానే "ఎవరది, ఎందుకొచ్చావు" అని కిటికీలోనుంచే గద్దించింది.

"నేనే, చుక్కమ్మా, చందమామను. కాస్త వెలుగు పెట్టవూ?" అన్నాను.

"ఫో, ఫో! ఇప్పుడు కావలసివచ్చానేం నేను? నల్లటి అట్ల పెనంమొహమూ నువ్వూ?" అని కసిరింది.

మీ అక్కయ్య బొమ్మ యియ్యక కరిసితే ఎలావుంటుంది? నాపనీ అంతే అయింది. కాళ్ళీడ్చుకొంటూ ఇంకొక చుక్కమ్మ యింటికి వెళ్ళాను.

"ఇక్కడ మాకే లేకపోతే నీ మొహానికెక్కడ ఇవ్వమంటావు, వెలుగు ?" అని మూలిగింది ఆమె. తతిమ్మా చుక్కమ్మలూ యిలాగే అన్నాయి. ఇక ఏమిచేసేది? బావురుమని ఏడ్చాను.

అప్పుడే మాతాత సూర్యుడు జఞాపకం వచ్చాడు. వెంటనే ఒక్కగంతులో మా తాతయ్య యింటిముందు వచ్చిపడ్డాను. కాని లోపలికివెళ్ళటం ఎట్లా? తలుపు తీదామంటే చేతులు కాలిపోవూ? అంతగా మా తాతయ్య యిల్లు వెలిగి