పుట:Chandamama 1947 07.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎక్కడికి పోతాడూ? ధైర్యం తెచ్చుకుని - "దీంటోకే పోదాంపద గుడ్డిమామా! రాక్షసివస్తే నేను జవాబు చెప్పుతాను." అన్నాడు.

ఇద్దరూ బలమంతా ఉపయోగించి తలుపునెట్టి గాడిదను లోపలికితోలి మళ్లీ తలుపుబిగించారు. లోపల రాక్షసీ లేదు, గీక్షసీ లేదు. వాళ్ళకు బాగా ఆకలి వేస్తున్నది. అన్నమూ, కూరలూ, పళ్లూ పెట్టి ఉన్నవి. గాడిదను స్తంభానికి కట్టివేసి ఇద్దరూ కూచుని ఆ అన్నమంతా మెక్కారు. కడుపు నిండేవరకు వాళ్ళకు నిద్రవచ్చింది. గురకపెట్టడం మొదలుపెట్టారు.

ఇంతలో ఎక్కడో తిరగటానికి పోయిన రాక్షసి వచ్చాడు. తలుపులు బిగించి ఉండేవరకు వాడికి కోపం వచ్చింది. "ఎవడ్రోయ్ లోపల! తలుపు తీస్తారా, మిమ్మల్ని పచ్చడి చెయ్య మంటారా?" అని కేకవేశాడు.

ఈ కేకతో గుడ్డివాడికి మెలకువ వచ్చింది. గజ గజ వణుకుతూ చెమిటి వాడిని లేపి "విన్నావా కేక! రాక్షసి వచ్చాడు!" అన్నాడు.

"నాకు వాడి కేకలంటే లెఖ్ఖలేదు. నువ్వుఊరుకో నేను జవాబుచెప్పుతాను." అని, చెమిటివాడు రాక్షసిని దబాయించాడు: "ముందు ఎవడివోయి నువ్వు? హాయిగా నిద్రపోయేవాళ్లనివచ్చి లేపుతావు!"

"నేనా? రాక్షసుణ్ణి. ఇది నా యిల్లు. తలుపు తియ్యకపోతే మీ ప్రాణాలు తీస్తాను." అన్నాడు రాక్షసుడు.

"నువ్వు రాక్షసుడివైతే, మేము గీక్షసులం. ఏమనుకున్నావు? మేము రోజూ రాక్షసులనే తింటాము అన్నంలో." అన్నాడు చెమిటివాడు బిగ్గిరిగా.