పుట:Chandamama 1947 07.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనగా అనగా ఒక నవాబు. ఆ నవాబుకు ఒక్కడే కొడుకు; ఒక్కతే కూతురు. కొడుకు చాలసాహసి. మిన్ను విరిగి మీదపడ్డా జంకేవాడుకాదు. పేరి ఫిరోజిషా. కూతురు చక్కని చుక్క. పేరు జహనారా.

ఆ నవాబు ప్రతి సంవత్సరం మహా వైభవంగా పీర్లపండగ చేసేవాడు. ఆ ఉత్సవాలు చూడడానికి దేశ దేశాలనుంచి రాజకుమారులు, కవులు, గాయకులు, శిల్పులు వచ్చేవాళ్ళు. వచ్చి తమతమ విద్యలనుచూపి నవాబువద్ద బహుమతులు పొందుతుండేవాళ్ళు.

ఒకయేడు ఆ ఉత్సవాలకు ఓముసలి శిల్పి వచ్చాడు. ఇతర శిల్పులు ఆడే బొమ్మలు, పాడేబొమ్మలు, ఇంకా రక రకాల ప్రతిమలుతెస్తే, ముసలితాత ఒక కొయ్యబొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు. తాతను చూడగానే తతిమ్మా శిల్పులకు ఎక్కడలేని నవ్వువచ్చింది.

" ఈ గుర్రాన్ని నువ్వే చేశావా తాతయ్యా," అని అడిగాడు ఒక శిల్పి.

"బలేగుర్రం తాతయ్యా, ఎంత కిస్తావు?" అని వెక్కిరించాడు మరొక శిల్పి.

"ఏమిగుర్ర మనుకున్నావేమిరా అది దేవతాగుర్రం," అన్నాడు మరొక శిల్పి.

"వాళ్లతో నీకెందుకుకాని దీన్ని ఎంతకిస్తావో నిజంగాచెప్పు తాతయ్యా," అన్నాడు నవ్వకుండా మరొక శిల్పి.

తాతకు కోపం వచ్చింది. "మీరు కొనలేరు, మీ అబ్బలు కొనలేరు. ఎందుకు