పుట:Chandamama 1947 07.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీళ్ళు తాగారు. కాకిబావ నాయుడుగారి తివాసీమీద ముక్కు తుడుచుకున్నాడు. కాకమ్మక్కయ్య పక్కగుడ్డలతో తుడుచుకున్నది.

ముక్కు తుడుచుకుంటూ ఉండగా కాకిబావకు మంచి ఆలోచన కలిగింది. ఫలహారం పళ్లెమంతా తనుపట్టుకు పోతే ఎంతబాగుంటుంది, అని? ఆలోచన బాగానేఉంది కాని పట్టుకుపోవటం ఎట్లా? ఫలహారం పళ్లెం ముక్కుకు అరపదు, అందుకని కాకిబావ ఫలహారం పళ్లెం కిందఉన్న గుడ్డను ముక్కుతో పట్టుకు లాగాడు. బల్లమీద పళ్లెమూ, గిన్నెలూ, గ్లాసులూ పెద్ద చప్పుడుతో కింద పడ్డాయి.

ఇక గప్‌చిప్, అక్కడ ఏంజరిగిందో కూడా చూడకుండా కాకిబావా, కాకమ్మక్కయ్యా ఊళ్లోకి ఉడాయించారు.