పుట:Chandamama 1947 07.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మర్నాడురాత్రి తీరిగ్గా నక్క వచ్చింది. దానికి బాగా ఆకలి వేస్తున్నది. తోటలో కాయలన్నీ తోటినక్కలు అదివరకే పాడుచేసినై. తోట అంతా గాలించటం మొదలుపెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనపడింది. అది అతి ఆశతో ఒక్కమాటుగా గుమ్మడికాయ మీద దూకింది. ఇంకేం, దానివొళ్లంతా తెగింది. నెత్తురు కారటం మొదలు పెట్టింది. వొల్లంతా మంటలు. ఏడ్చుకుంటూ, కాళ్ళీడ్చుకుంటూ పోయి ఒక రాతిమీద కూర్చున్నది. చాలాసేపటిదాకా నెత్తురు కారిపోతూనే ఉన్నది. ఇక ఇలాంటి తప్పుడుపని చెయ్యకూడదని మనస్సులోకున్నది. మంగలిని దొంగముండా కొడుకని తిట్టింది. ఎన్నితిట్టినా, ఎవరిని తిట్టినా దానినొప్పి తగ్గుతుందా? నెత్తురు కారకుండా ఉంటుందా ? నెత్తురు కారటం ఆగినతర్వాత బయలుదేరుదామనుకున్నది. కాని ఆ నెత్తురు ఎండి గడ్డకట్టి అందులో ఇరుక్కుపోయింది. అందులోంచి కదలాలేదు, మెదలాలేదు. నక్కకి మంగలిమీద భలేకోపం వచ్చింది. "నన్ను ఇందుట్లోనించి బయటికిరానియ్యి వీడిపని పట్టకపోతే!" అని శపధం చేసింది.

పాపం: ముందు ఇది బయటపడితే కదా మంగలిపని పట్టటానికి. అబ్బాయిలూ, మనంకూడా చూద్దాము, నక్క వాడిపని ఎట్లా పట్టుతుందో: