పుట:Chandamama 1947 07.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాత్రంతా మేలుకొని కడుపు ఉబ్బేదాకా, పళ్ళు కాయలు మెక్కేది. ఒక్కపండు కాయ కనపడనిచ్చేది కాదు.

ఒకనాడు మంగలి "నక్కబావా, నక్క బావా: తోటలో కాయలేమైనా ఉన్నాయా?" అని అడిగాడు. "ఇప్పుడెక్కడివి? వానాకాలం వస్తేగా దొరికేదీ?" అన్నది నక్క. పాపం, మంగలి నమ్మాడు. వానాకాలంవచ్చినాక అడిగాడు. "వానాకాలంలో ఎక్కడన్నా కాయలు ఉంటాయా? చలికాలం రావాలి:" అన్నది.చలికాలం వచ్చినాక అడిగితే, "పిచ్చివాడా: చలికాలంలో కాయలు దొరకుతాయా, పిందెలు ఉంటాయి, ఎండాకాలంలో అడుగు," అని ఇట్లా ఏదో ఒకసాకు చెప్పుతూ మంగలిని ఒక్క కాయ తిననివ్వలేదు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. కాయలు కాచినై. నక్క ఒకనాటి రాత్రి అడివికిపోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటినన్నిటినీ విందుకు పిలిచింది. అవి వచ్చి, పొట్ట పట్టినన్ని తిని, మిగాతావి తుంచి, కొరికి, మట్టిలో పారవేసిపోయి చక్కా పండుకొన్నవి.

పాపం, మర్నాడు పొద్దున మంగలి వచ్చి తోట చూసుకుంటే కళ్ల వెంబడి నీళ్ళు వచ్చినై. చెట్లుని ఒక్క కాయ లేదు. ఒక్కమూలనుమాత్రం గుమ్మడి పాదుకు ఒక గుమ్మడికాయ ఉంది. అదీ ఆకులు కమ్మిఉండటం మూలాన కనపడటంలేదు. నక్కచేసిన మోసానికి దాన్ని దండించాలనుకున్నాడు మంగలి. ఇంటోకిపోయి పొదిలోనుంచి మంగలి కత్తులు తీసి బాగా సానపట్టి గుమ్మడికాయకి చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనపడకుండా ఆకులు అడ్డం పెట్టి, ఇంటికిపోయి హాయిగా నిద్రపోయాడు.