పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1.పునీతమాత

మనవిమాట

ఈ గ్రంథం శ్రీసభలో మరియమాతకుండే స్థానమేమిటో నిర్ధారిస్తుంది. ఆ పునీతమాతపట్ల భక్తి ఎందుకు చూపాలో, ఎలా చూపాలో చెప్తుంది. ఈ పుస్తకాన్ని మరియను గూర్చిన కట్టుకథలతో నింపదలచుకోలేదు. ఇది ప్రధానంగా మరియను గూర్చిన దైవశాస్తాలను వివరించే గ్రంథం. ఈ శాస్త్రాంశాలుకూడ అత్యధికంగా పితృపాదుల పారంపర్య బోధనుండి స్వీకరింపబడ్డాయి. బైబులు వస్తుతః మరియనుగూర్చి చెప్పే అంశాలు చాల స్వల్పం.

మామూలుగా మరియు మాత పేరెత్తగానే ప్రోటస్టెంటు సోదరులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. కాని ఈ భేదభావాలు అడుగంటిపోవాలనే రచయిత కోరిక. అంచేత ఈ పుస్తకంలో మరియనుగూర్చిన క్యాతలిక్ భావాలూ, ప్రోటస్టెంటు భావాలూ నిష్పాక్షికంగా చర్చింపబడ్డాయి. పితృపాదుల పారంపర్యబోధను గుర్తించందే మరియు స్థానమూ, ఆ పునీతమాతపట్ల చూపే భక్తి అర్థంకావని నిరూపింపబడింది. ఈ గ్రంథం క్రైస్తవశాఖల విభజనకు గాక, సమైక్యతకు దోహదం చేయాలనే గ్రంథకర్త ఆశయం. క్రీస్తు జననియైన మరియ క్రైస్తవ ప్రజను ఐక్యం చేస్తుందిగాని విభజించదు.

మామూలుగా క్యాతలిక్ క్రైస్తవులకు మరియమాత పట్ల గాఢభక్తి వుంటుంది. కాని ఈ భక్తి కొన్నిసార్లు అర్థంలేని మూఢభక్తి ఐపోతూంటుంది. ఈ గ్రంథంలో దేవుని రక్షణ ప్రణాళికలో మరియకున్న స్థానమేమిటో శాస్త్రదృష్టితో వివరించి చెప్పాం. ఈ పుస్తకపఠనం వలన మన ప్రజల మరియభక్తి పూర్వంకంటె అర్థవంతమూ ఫలభరితమూ ఐనట్లయితే గ్రంథకర్తకు అదే పదివేలు. ఇది ఆరవ ముద్రణం.

విషయసూచిక

1. నిష్కళంకమాత 2
2. కన్యమాత 6
3. దేవమాత 11
4. రక్షణమాత 15
5. ఉత్థాపితమాత 19
6. మరియరాజ్ఞ 22