పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. వరప్రసాదమాత 24
8. ఇద్దరు ఏవలు 27
9. ధీరనారి మరియ 30
10. మరియమాతపట్ల భక్తి 34
11. ఆదర్శమాత 37
12. మరియమాత - సమైక్యత 41
13. మరియమాత - శ్రీసభ 45

1. నిష్కళంకమాత

సెడూలియస్ అనే ఐదవ శతాబ్దపు లాటిను కవి మరియమాతను ప్రశంసిస్తూ "సుందరమైన గులాబిపూవు ముండ్లమొక్క మీద ఎదుగుతుంది. అది తల్లి చెట్టకంటె అందమైంది. తల్లి చెట్టులాగ ముళ్ళు లేందికూడ. అలాగే మరియ అనే పూవుకూడ ఏవ అనే ముండ్ల మొక్కమీద వికసించింది. ఈ కన్య దోషరహితయై దోషసహితయైన ఆ తొలికన్య పాపానికి ప్రాయశ్చిత్తం చేసిం" దని వ్రాసాడు. ఈ కవి భావించినట్లు మరియ నిష్కళంక. ప్రస్తుతం నిష్కళంకమాతను గూర్చి ఐదంశాలు విచారిద్దాం.

1. నిష్కళంకమాత అంటే యేమిటి?

మరియా మనలాగే పాపపు ఆదాము కుటుంబంలో పుట్టింది. కనుక మనలాగే ఆమెకూ జన్మపాపం సోకాలిసింది. కాని పాపం ఆమెకు సోకలేదు. పరలోకంలోని తండ్రి మరియను జన్మపాపం నుండి పదిలపరచాడు. ఎలాగ? భవిష్యత్తులో జన్మింపబోయే క్రీస్తు వర ప్రసాదాలద్వారా దేవుడు ముందుగానే మరియను పాపం నుండి పదిలపరచాడు. మనమంతా పాపంలో పుట్టాం, అలా పుట్టినంక, క్రీస్తు ద్వారా ఆ పాపం నుండి రక్షింపబడ్డాం. కాని అదే క్రీస్తు ద్వారా మరియ అసలు పాపానికి గురికాకుండానే పదిల పరచబడింది. నేలమీద జారిపడిన పసిగందును లేవనెత్తడం కంటె, ఆ బిడ్డ అసలు పడకుండా వుండేలా జాగ్రత్తపడ్డం మేలు. పరలోకపిత మరియమాతనుకూడ అలా జాగ్రత్తతో పదిలపరచాడు.

కనుక మన రక్షణకంటె ఆమె రక్షణం శ్రేష్ఠమైంది. ఆమెకు అబ్బినభాగ్యం మన కబ్బలేదు. ఈ రక్షణ ఫలితంగా ఆమెకు జన్మపాపమూ సోకలేదు, కర్మపాపమూ సోకలేదు. కర్మపాపరూపమైన చావైన పాపంగానీ స్వల్పపాపంగానీ ఆమెకు కళంకం ఆపాదించలేదు.