పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు మనకోసం ఏమి సాధించాడో, క్రీస్తునుండి మనం ఏమి సాధించ గోరుతుంటామో అదంతా మరియ ఈవరకే సాధించింది. కనుక ఆమె శ్రీసభకూ, క్రైస్తవ ప్రజలకూ ప్రేరణం. మాతృ ప్రతిని చూచి మరో ప్రతిని వ్రాస్తారు. మాతృచిత్రాన్ని చూచి మరో చిత్రాన్ని గీస్తాం. అలాగే మాతృకయైన మరియనుచూచి మనమూ ఆమెలాగే తయారు కాగోరుతాం. ఆమె శ్రీసభకు మాతృక, ఆదర్శం, పోలిక, ప్రాతిపదిక అంటే భావం యిదే.

మరియను ఎప్పుడూ శ్రీసభతో జోడిస్తుండాలి. ఆమెను అర్థం చేసికుంటే శ్రీసభను అర్థం చేసుకున్నట్లు, శ్రీసభను అర్థం జేసికుంటే ఆమెను అర్థం జేసుకున్నట్లు, ఇక మరియ శ్రీసభలను అర్థం జేసికుంటే క్రీస్తును అర్థం జేసుకున్నట్లు, క్రీస్తు రక్షణం మరియ యందు వ్యక్తిగతంగా, శ్రీసభయందు సామాజికంగా ఫలసిద్ధి నిస్తుంది. మరియయందు క్రీస్తురూపం సంపూర్ణంగా ప్రతిఫలించింది. అనగా ఆ విశుదురాలు దేవుడు సంకల్పించుకున్న నరులు ఎల నిర్మలంగా వండాలో అలా వుండిపోయింది. కనుక దేవుడు సంకల్పించుకున్న క్రైస్తవ సమాజానికి - ఆ సంకల్పం ప్రకారం జీవించలేకపోతూన్న శ్రీసభకు - ఆమె ఆదర్శంగా నిలుస్తుంది.

దేవుడు నరుల్లో ఎలా కన్పిస్తాడో, క్రీస్తు మానవుల్లో ఎలా ప్రతిఫలిస్తాడో చూడాలంటే మరియను చూడాలి. మంగళప్రదమైన ఆమె మహిమాన్విత గుణాలన్నీ మన మీద పనిచేస్తాయి. మనమూ ఆమె మహిమను పొందేలా చేస్తాయి. ఆమె శ్రీసభలో తొలివ్యక్తి మనం మలివ్యక్తులం. అందుకే మనం ఆ యావలితీరాన్ని చేరుకోవాలంటే ఆమె సహాయం పొందుతూండాలి.

దేవుడు మానవులమధ్యలో జన్మించడానికీ, అలా జన్మించి మానవులను దేవుని బిడ్డలను చేయడానికి మరియ నుండి జన్మింపవలసి వచ్చింది - గల 4,5. కనుక ఆ తల్లి దేవమాత, మానవులమాత, ఆ పునీతమాతకు జోహారు!