పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరియ. కనుక పాపాన్ని జయించి నిష్కల్మషత్వాన్ని బడయడంలో ఆమె మనకూ శ్రీసభకూ ఆదర్శంగా వుంటుంది.

మరియ కన్య మరియలాగే శ్రీసభకూడ కన్య - 2కొ 11,2. మరియలాగే శ్రీసభకూడ కన్యగావుండే పవిత్రాత్మ శక్తివలన జ్ఞానస్నానం ద్వారా మనలను కంటుంది. మరియ కన్యగా వుండి అవిభక్త హృదయంతో ప్రభువుకి అంకితమైంది.కాని శ్రీసభ, ఈసభ సభ్యులు అంతటి గాధ హృదయంతో ప్రభువుకి సమర్పితులు కారు. కనుక ఈ సమర్పణ విషయంలోకూడ మరియు మనకు ఆదర్శంగా వుంటుంది.

నరులను నరులే రక్షించుకోవాలి అన్న భావంతో దేవుడు మరియను క్రీస్తుతో సహరక్షికిని చేసాడన్నాం, మరియలాగే శ్రీసభకూడ సహరక్షకి - కొలో 1-24. శ్రీసభ సంస్కారాలు, ఆరాధనా, ప్రేషితకార్యం ఇవన్నీ క్రీస్తు రక్షణాన్ని కొనసాగించడం కోసమేగదా! కాని మరియు క్రీస్తు పుట్టువునందు మరణంనందు సహరక్షికి ఐనంతగా శ్రీసభ తాను కాలేదు. ఈ రక్షణం విషయంలోకూడ మరియు శ్రీసభకు ప్రేరణంగా వుంటుంది.

క్రీస్తు మరియలు ఉత్తానమహిమ పొందారు. మరియలాగే శ్రీసభకూడ ఉత్తానభాగ్యం పొందుతుంది - 1కొ 15, 20-23. కాని ఈ భాగ్యం వెంటనే లభించదు. లోకాంతం వరకూ వేచివుండాలి. ఈ వరకే ఉత్తానమహిమను బడసిన మరియు ఇకమీదట ఉత్థానాన్ని పొందవలసిన శ్రీసభకు ప్రేరణంగా వుంటుంది.

క్రీస్తు మోక్షంలో వుండి మన తరపున తండ్రిని మనవి చేస్తూంటాడు - హెబ్రే 7,25. మనకు వరప్రసాదాలు ఇస్తూంటాడు. అలాగే మోక్షాన్ని చేరుకున్న శ్రీసభకూడా పనీతుల రూపంలో మనకోసం దేవుని మనవి చేస్తూంటుంది. కాని ఈ పునీతులందరికంటె కూడ మరియు అధికంగా విన్నపం జేస్తూ వీళ్ళందరికీ తాను విజ్ఞాపన విషయంలో ప్రేరణంగా వుంటుంది.

ఉత్తానక్రీస్తు రాజుగా పరిపాలనం జేస్తూంటాడు. శ్రీసభకూడ ఈ క్రీస్తు రాచరికంలో పాల్గొనాలి - 2 తిమో 2,12. మరియ రాజ్ఞత్వం శ్రీసభ రాజ్ఞత్వానికి ప్రేరణం.

సంగ్రహంగా చెప్పాలంటే మరియు శ్రీసభకు, అనగా మనకు ఆశగాను ఆదరువుగాను వుంటుంది. ఆమె మహిమను పొంది మోక్షంలోవుంది. మనమూ ఆ పదవిని పొందాలి. కాని ఇంకా పొందలేదు. అంచేత ఈ లోకంలో వున్నంత కాలం ఆమెవైపుచూస్తూంటాం. ఆమె వున్నచోటికి వెళ్ళాలని ఉవ్విళూరుతుంటాం. ఆమె మనకు అండదండగా ఆదరువుగా ఉంటుంది.