పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గౌరవాదరాలతో చూచేది. బాలయేసు కన్పించకుండాబోయి మళ్లా దేవాలయంలో కంటపడ్డప్పడు ఆమె "బాబూ! నీవెక్కడున్నావు? మీనాన్న నేను పుట్టెడు దుఃఖముతో నీకోసం వెదకుతున్నాం గదా!" అంది -లూకా 2,48. ఈ వాక్యాన్నిబట్టే ఆమెకు భర్తపట్ల వున్న గౌరవం వెల్లడి ఔతుంది. కుటుంబజీవితంలో ఆలుమగలు ప్రేమభావంతోను పరస్పర గౌరవంతోను జీవించడానికి మరియ ఆదర్శంగా వుంటుంది. తాను గృహస్థప్రజలకు s వరప్రసాదాన్ని ఆర్ధించి పెడుతూందిగూడ.

తల్లిదండ్రులు పిల్లలను కని పెంచడంగూడ గొప్ప బాధ్యత. మరియ క్రీస్తుబిడ్డనుకని అనురాగంతో పెంచింది. యూదమత నియమాల ప్రకారం ఆ బిడ్డకు జరిపించవలసిన ఆచారాలన్నీ జరిపించింది. యెరూషలేము యాత్రా సందర్భంలో కుమారుణ్ణి కోల్పోయినపుడు ఆమెకు కడుపు తరుగుకొనిపోయింది. ఇక, ఆ కుమారుడుకూడ తల్లిదండ్రులకు విధేయుడై వర్తించాడు — లూకా 1, 51. మన కుటుంబాల్లో తరచుగా తల్లిదండ్రులకూ బిడ్డలకూ మధ్య బోలెడన్ని చిక్కులూ అపార్థాలూ వస్తూంటాయి. ఈ పట్టున తల్లిదండ్రులకూ బిడ్డలకూ తిరుకుటుంబమే ఆదర్శం, మరియు మన తల్లిదండ్రులకూ బిడ్డలకూ గూడ పరస్పర ప్రేమతో జీవించే భాగ్యాన్ని ఆర్ధించి పెడుతుంది.

గృహిణికి దైవభక్తి చాలముఖ్యం. ఆమె భక్తురాలైతే కుటుంబమంతా భక్తిమంతంగా మెలుగుతుంది. మరియ ఈలాంటి భక్తురాలు. ఆమె ప్రభువుమీదనే హృదయం లగ్నంజేసికొని జీవిస్తూండేది. దేవాలయానికివెళ్ళి పూర్వవేదభగవంతుణ్ణి సేవించు కొంటూండేది. పరిశుద్దాత్మవలన అంతరంగంలో ప్రబోధం చెందుతూండేది. పూర్వవేదం చదువుకొని ప్రభు ధర్మశాస్త్రం ధ్యానించుకొంటూండేది. మరియ మననమూర్తి, ధ్యానశీల. “ఆమె యిూ విషయాలన్నీ మనసులో తలపోసికొంటూండేది" అన్న లూకా వాక్యమే ఇందుకు తార్మాణం - 2, 52. ఆ భక్తురాలు క్రైస్తవ గృహిణులకు కుటుంబభక్తిని నేర్పుతుంది. హృదయం భగవంతునిమీద లగ్నం చేసికోవడమూ ప్రభుగ్రంథాన్ని పఠించి ధ్యానం చేసికోవడమూ అనే భాగ్యాలను సంపాదించి పెడుతుంది.

యూదసమాజంలో మగవాళ్ళకుమాత్రమే ప్రాధాన్యముండేది. అలాంటి సమాజంలో ఆడవాళ్ళ తరుచుగా బాధలకూ చిక్కులకూ అపార్థాలకూ గురౌతుండేవాళ్ళు మరియకు కూడ ఈ దుర్గతి తప్పలేదు. యోసేపు గర్భవతియైన మరియను శంకింపగా - అతడు తనపట్ల ఎంతమృదువుగా ప్రవర్తించినాగాని - ఆమెకు కొండంతబాధ కలిగివుండాలి గదా? మన భారతీయ సమాజంకూడ యూదసమాజంలాగే స్త్రీకి విలువనీయని సమాజం. ఈ సమాజంలో స్త్రీకి జరిగే అన్యాయాలూ అపచారాలూ అన్నీ యిన్నీకావు. మన దేశంలో ఆడవాళ్ళు కన్నీరుగార్చని యిండు అరుదంటే అతిశయోక్తి