పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ తండ్రికి తెలుసు. మనం పోయేదికూడ ఆ నాన్న యింటికే. కనుక మన తరపున మనం అకాలమృత్యువు వాతబడతామేమోనని భయపడనక్కరలేదు. అసలు మనచావు మనకు ముందుగా తెలియకుండా ఉంటేనే మంచిది. అలా తెలిస్తే దిగులువల్ల చావు రాకముందే చనిపోమా? అందుకే దేవుడు మంచివాడు కనుక మరణాన్ని మనకు ముందుగా తెలియనీడు.

3. మృత్యువు పాప ఫలితం

       నరులంతా చనిపోవలసిందే. మనం చనిపోయేవాళ్ళను రోజూ చూస్తూనే ఉంటాం. అందుచేత నరులకు మరణం సహజంగానే వస్తుందనుకొంటాం. కాని మరణం సహజ సిద్ధమైంది మాత్రమేకాదు. అది పాపఫలితం కూడ. ఈ సత్యం మనకు దివ్యశ్రుతినుండి మాత్రమే తెలుస్తుంది

. భగవంతుడు మనలను చావడానికిగాక బ్రతకడానికి సృజించాడు. పాపఫలితంగా మనమే చావుని కొనితెచ్చుకొన్నాం. సొలోమోను జ్ఞానగ్రంథం

    దేవుడు నరుడ్డి అమరుడ్డిగా జేసాడు
    అతన్ని తనవలె నిత్యునిగా జేసాడు,
    కాని పిశాచం అసూయవలన
    మృత్యువు లోకంలోనికి ప్రవేశించింది

అని చెప్తుంది - 2,23-24 ఆదాము పాపం చేయకముందు లోకంలో చావలేదు. ఒక నరుని పాపంద్వారా మృత్యువు మొదటిసారిగా లోకంలో అడుగుపెట్టింది-రోమా 5,12. యెషయా ప్రవక్త వర్ణించిన బాధామయ సేవకుడూ, ఆసేవకుడు సూచించే క్రీస్తుకూడ నరుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికే స్వీయప్రాణాలు అర్పించారు - యెష 53.

   పాపం యొక్క ఫలితం మరణం అన్నాడు పౌలు - రోమా 6,23. అనగా పాపఫలితంగా మరణం వచ్చింది. ఇంకా మరణం యొక్క మల్ల పాపం-1కొ 15,56. అనగా చావు మనలను ఓ విషప్రాణిలా కుడుతుంది. అలా కుట్టే శక్తి దానికి పాపంనుండే వచ్చింది. ఆదాము నుంచి సంక్రమించే జన్మపాపమూ మన సొంత పాపాలూ కలసి మనకు ఈ మృత్యువును తెచ్చి పెడతాయి

.

  మూమూలుగా మనం మరణించేప్పడు చాల బాధలను అనుభవింపవలసి ఉంటుంది. మరణంలాగే ఈ బాధలుకూడ పాపజనితాలే. మరణానికీ మరణబాధలకూ గూడ మనం సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అవి మన పాపఫలితాలు. వాటిని మనం తప్పించుకోలేం.