పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వవేదంలోని యూదులు యావే ప్రభువు రక్షణం తమకు మాత్రమేననీ, అన్యజాతుల ప్రజలందరూ నాశమైపోతారనీ భావించారు. ఈ దర్శనంలో పౌలు రక్షణం యూదులకు మాత్రమేకాక, అన్యజాతి ప్రజలకు గూడ సిద్ధిస్తుందని గుర్తించాడు. తాను అన్యజాతులకు క్రీస్తుని అత్యవసరంగా బోధించాలనిగూడ గ్రహించాడు. అతన్ని బోధించకపోతే తాను ముదనష్టమైపోతానని తెలిసికొన్నాడు. కనుకనే "క్రీస్తుని బోధించకపోతే నా పరిస్థితి దారుణమౌతుంది" అని చెప్పకొన్నాడు - 1కొ9,16. యిర్మీయా మొదలైన పూర్వ ప్రవక్తల్లాగ తానూ తల్లి గర్భంనుండే ప్రభువు సేవకు పిలువబడినవాజ్ఞని యెంచాడు - గల 1,15-16.

ద్వితీయోపదేశ గ్రంథం పేర్కొన్నట్లుగా సిలువపై చనిపోయిన క్రీస్తు శాపగ్రస్తుడే – 21,22-23. కాని అతడు శాపగ్రస్తుడు అయింది ఎందుకు? తన పాపాల కొరకు కాదు. మన పాపాల కొరకు, సిలువ మరణం ద్వారా అతడు శాపానికి గురై మన శాపాన్ని తొలగించాడు - గల 3,13. ఈలా అర్థం చేసికోవడంద్వారా పౌలుకి క్రీస్తుపట్ల గల ఈసడింపు తొలగిపోయింది. అతనిపట్ల గాఢమైన కృతజ్ఞతాభావం కలిగింది. ఆ క్రీస్తుని అందరికీ బోధించాలన్న తీవ్రమైన కోరికకూడ కలిగింది.

పౌలుకి రక్షణ చరిత్రలో మూడు దశలున్నాయని అర్థమైంది, మొదటిదశ అబ్రాహామునుండి మోషేవరకు. ఈ దశలో ధర్మశాస్త్రంలేదు, సొంత అంతరాత్మ ప్రకారం జీవించిన నరుడెల్లా రక్షణం పొందాడు. రెండవదశ మోషేనుండి మెస్సియా వచ్చిందాకా. ఈ దశలో ధర్మశాస్త్రం నరులకు రక్షణాన్నొసగింది. కావుననే పూర్వవేద యూదులు భక్తి శ్రద్ధలతో మోషే ఆజ్ఞలను పాటించారు. ఇక మూడవదశ క్రీస్తు ఊత్దానకాలంనుండి లోకాంతంవరకు. ఇది మెస్సియా కాలం. ఈ దశలో క్రీస్తుని విశ్వసించి రక్షణం పొందాలి. అతని మరణోత్దానాలను నమ్మి అతని ప్రేమాజ్ఞలను పాటించి పాపపరిహారం పొందాలి. ఇప్పడు మనమంతా ఈ మూడవదశలో వున్నాం. కనుక ఈ మూడవదశలో అవశ్యంగా క్రీస్తుని ప్రజలందరికి బోధించాలని పౌలుకి తట్టింది. కనుకనే వేదబోధమీద అతనికి తపన.

ఈ విధంగా డమస్కు దర్శనంలో ఎన్నో దైవరహస్యాలు ఇమిడి వున్నాయి. అది పౌలుకి జీవితాంతం వరకు ప్రేరణం పుట్టించి అతన్ని ముందుకి నడిపిస్తూ వచ్చింది. మనకుగూడ ఈ డమస్కదర్శనం అనేది ఒకటి సొంతంగా వుంటేనే తప్ప మన జీవితాన్ని భక్తితో గడపలేం.