పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రైస్తవ సమాజంలో చేరాలని ప్రభువు నిర్ణయించాడు. నేడుకూడ మనం క్రీస్తు స్థానంలో వున్న పెద్దలను కాదని క్రీస్తుని చేరలేం.

అననీయా యూదా యింటిలోవున్న సౌలుని దర్శించడానికి వచ్చాడు. అతని రాకతో సౌలు బలహీనత తొలగిపోయింది. అతనికి చూపకూడ వచ్చింది. అతని కండ్ల నుండి పొరలు చేప పొలుసుల్లాగ రాలి క్రిందబడ్డాయి, పూర్వం గ్రుడ్డివాడైన తోబియా కండ్లనుండి ఈలాగే పొరలు రాలిపడ్డాయని వింటున్నాం - తోబీతు 11,12-13.

అననీయా భక్తుడు సౌలుకి జ్ఞానస్నానమిచ్చాడు, సౌలు క్రైస్తవ సమాజంలో చేరిపోయాడు. ఈ జ్ఞానస్నానం తోనే అతడు ఆత్మను పరిపూర్ణంగా పొందాడు. ఇకమీదట ఆత్మే అతన్ని నడిపిస్తుంది. అతనిచేత నానా పట్టణాల్లో నానా ప్రజలకు వేదబోధ చేయిస్తుంది. కడన ఆత్మే అతనిని రోము పట్టణానికి తోడ్కొనిపోయి అక్కడ వేదసాక్షిగా మరణించేలాగూడ చేస్తుంది.

డమస్కు దర్శనం పౌలులో గొప్ప మార్పు తెచ్చింది. ఆ సంఘటనం తర్వాత అతని భావనాసరణి పూర్తిగా మారింది. అది అతనికి గొప్ప ప్రేరణం పుట్టించింది. కనుక ఈ దర్శనం పౌలుని ప్రభావితం చేసిన తీరును మనం కొంచెం విపులంగా తెలిసికోవాలి.

పౌలు మొదట పాపిగా వుండి తర్వాత ఈ దర్శనం వల్ల పరివర్తనం చెందలేదు. అతడు యూదమతం ప్రకారం మచ్చలేని జీవితమే గడిపాడు. ఈ దర్శనం వల్ల అతడు యూదమతాన్ని వదలి క్రైస్తవ మతంలోకి వచ్చాడు. రక్షణం ధర్మశాస్రాన్ని పాటించడంవల్లకాక క్రీస్తుని విశ్వసించడం వల్ల లభిస్తుందని గ్రహించాడు. ఈ దృష్టిలో మాత్రమే డమస్కదర్శనం అతనికి పరివర్తనం కలిగించింది.

తరతరాలబట్టి యూదులు మెస్సీయాకోసం గంపేడాశతో ఎదురుచూస్తున్నారు. కాని అతడు ఎప్పడు వస్తాడో వారికి తెలియదు. డమస్కు దర్శనంవల్ల పౌలు క్రీస్తు రాకడతోనే మెస్సియా కాలం ప్రారంభమైందని గుర్తించాడు - 1కొ 10,11. యూదులు కోరిన కోరికలన్నీ మెస్సియాద్వారా సిద్ధించాయని తెలిసికొన్నాడు.

మోషే కాలంనుండి క్రీస్తు వరకు రక్షణం ధర్మశాస్తాన్ని పాటించడం వల్ల సిద్ధించింది. యెరూషలేము దేవాలయంలో ఆరాధనలు జరపడంవల్ల సిద్ధించింది. కాని యికమీదట క్రీస్తుని విశ్వసించడం వల్లగాని రక్షణం లభించదు. పూర్వవేద కాలంలోలాగ యిప్పడు మన పుణ్యక్రియలు మనలను రక్షించవు. ఈ పుణ్యక్రియలు ప్రధానంగా ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను పాటించడమే. ఇప్పడు మనలను రక్షించేది క్రీస్తు వరప్రసాదం. ప్రభువు మరణోత్థానాలు మనకు పాపవిమోచనం కలిగిస్తాయి. ఈ సత్యం పౌలుకి బాగా అర్థమైంది. 203