పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలా చేయలేదు. అతడు మంచి రాజు, బలహీనత వల్ల పాపంలో పడిపోయినా, తన తప్పని తెలిసికొని పశ్చాత్తాపపడ్డాడు. అతడు వినయంతో నేను యావేకు ద్రోహంగా పాపం చేసాను. ప్రభువు నా తప్పిదాన్ని మన్నించాలని వేడుకొంటున్నాను అన్నాడు. నాతాను రాజుతో నీవు సద్బుద్ధితో పశ్చాత్తాపపడ్డావు కనుక ప్రభువు నీ దోషాలన్నీ మన్నించానడు. ఈ పాప ఫలితంగా నీవు చావవుగాని నీ వలన బత్షెబాకు కలిగిన బిడ్డడు చనిపోతాడు అని చెప్పాడు. తర్వాత అలాగే జరిగింది.

పూర్వం సౌలు పాపంజేయగా ప్రభువు అతన్ని నాశంజేసాడు. రెండవ రాజాయిన దావీదు పాపంజేస్తే దేవుడు అతన్నెందుకు వదలివేసాడు? దావీదునీ అతని అనుయాయులనూ కరుణిస్తానని ప్రభువు పూర్వం మాటయిచ్చాడు. ఈ అనుయాయులనుండే తర్వాత మెస్సీయా ఉద్భవిస్తాడు. కనుక దేవుడు తన ప్రమాణాన్ని నిలబెట్టుకోగోరి ఇక్కడ దావీదుని నాశం చేయలేదు - 7,14-15.

3. ప్రార్ధనా భావాలు

1. ప్రజల దృష్టిలో దావీదు గొప్పవాడు, శూరుడు. అతని కీర్తికీ విజయాలకూ అంతులేదు. కాని దేవుని దృష్టిలో అతడు దుర్మార్గుడు. పేదవానిని చంపి వాని గొర్రెపిల్లను అపహరించిన దుష్టుడు. కనుక అతనికి శిక్షలు పడ్డాయి. ఒకసారి లోకం మనలను మెచ్చుకొంటుంది. ఇరుగుపొరుగువాళ్ళు మనలను మంచివాళ్ళమని పొగుడుతారు. వాళ్ళ మాటలు విని మనంకూడ మురిసిపోతాం. కాని నరులు మనలను మెచ్చుకొంటేచాలదు. వాళ్ళకు మన రహస్యకార్యాలు తెలియవు కదా! దేవుడు మనలను మెచ్చుకోవాలి. అప్పుడే మనకు విలువ. అందరి హృదయాలు న్యాయాన్యాయాలు తెలిసిన దేవుడు మనలను అంగీకరిస్తే అప్పడు మనకు నిజమైన గుర్తింపు. కనుక మనమెప్పడుకూడ నరుల దృష్టిలో కాక దేవుని దృష్టిలో ఏలా చలామణి ఔతున్నామా అని పరిశీలించి చూచుకోవాలి.

2. నేను చెప్పిన దుష్టుడవు నీవే అని ప్రవక్త పలికిన వాక్యం దేవుని వాక్యం. కనుకనే అది దావీదుకి పశ్చాత్తాపం పుట్టించింది. ప్రభువు వాక్యం నేడు మనకుకూడ పశ్చాత్తాపం కలిగిస్తుంది. మనం వేదవాక్యం చదువుకొనేప్పడు అది మన తప్పిదాలకు మనలను ఖండిస్తుంది. మన దోషాన్ని ఎత్తిచూపుతుంది. న్యాయాధిపతిలాగ మనకు తీర్చు చెప్తుంది - హెబ్రే 4,12. కనుక భక్తుడు తరచుగా బైబులు చదువుకొని ఆ వేదవాక్యం కలిగించే ప్రేరణం ద్వారా తన హృదయాన్ని శుద్ధిచేసుకోవాలి - యోహా 15,3.