పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాలుని షిలో దేవళంలో కానుకగా అర్పించింది. అప్పడు షిలొలొ పెద్ద గురువు ఏలీ. అతని కుమారులు ఫీనెహాసు హోప్నికూడ అక్కడే యాజకులు. సమూవేలు ఈ దేవళంలోనే పెరుగుతూ కోవెలలో ఏలీకి సహాయం చేస్తూండేవాడు.

                                                              2. వివరణం

సమూవేలుకి ఇంచుమించు 12 ఏండ్ల యిూడు వచ్చినప్పడు దేవాలయంలో దేవుడు దర్శనమిచ్చాడు. ఆ రొజుల్లో యిస్రాయేలు ప్రజలు దేవుని సందేశం వినాలని ఉవ్విళ్ళూరిపోతున్నారుగాని ఆ సందేశాన్నితెలియజెప్పే ప్రవక్తలెవరూ లేరు. ఏలీ యాజక కుటుంబం పాపకార్యాల్లో మునిగి తేలుతూంది. ఆ కుటుంబాన్ని జూచి ప్రభువు ప్రజల మీద కోపించి వారికి తన దివ్యవాణిని విన్పించలేదు.

అప్పటికే యేలీ ముదివగు. అతనికి కంటిచూపుగూడ మందగించింది. ఓనాటిరాత్రి అతడు దేవళంలోని మధ్య భాగంలో పండుకొని నిద్రిస్తూన్నాడు. సమూవేలు గర్భాగారంలో మందసంవద్ద పండుకొని నిద్రపోతూన్నాడు. మందసం కొయ్యపెట్టె దానిలో ప్రభువ మోషేకు వ్రాసియిచ్చిన రెండు రాతిపలకలు వుండేవి. ఈ పెట్టె పూర్వవేదకాలంలో దైవసాన్నిధ్యం. ఈ పెట్టెదగ్గర రాత్రంతా దీపం వెలుగుతుండేది. ఆ దీపంలో చమురు ఐపోయినప్పడల్లా మళ్ళా చమురు పోవడం సమూవేలు పని. అందుకే అతడు గర్భాగారంలో పండుకొని వున్నాడు. ఆ రాత్రి వేకువజామున ప్రభువు సమూవేలుని పేరుపెట్టి పిల్చాడు. బాలుడు గబాలున లేచి యేలీయొద్దకు పరుగెత్తుకొని వెళ్ళి అయ్యా పిల్చావా ఇదిగో వచ్చాను అన్నాడు. ఏలీ నాయనా నేను నిన్ను పిలువలేదు వెళ్ళి పండుకో అన్నాడు. ఈ విధంగా మూడుసార్లు జరిగింది. సమూవేలుకి ఇంకా ప్రభువునిగూర్చి తెలియదు. అనగా ప్రభువు అతన్నింకా తన ప్రవక్తనుగా చేసికోలేదు. అతనికింకా దేవునితో సన్నిహితమైన సంబంధం కలగలేదు. కనుక సమూవేలు మూడుసార్లు ఏలీయే తన్నుపిలుస్తున్నాడనుకొని పొరపాటుపడ్డాడు.
మూడవసారి యేలీకి అర్థమైంది. అపరాత్రిలో దేవళంలో పిల్లవాణ్ణి ఎవరు పిలుస్తారు? దేవుడే పిల్చివుండాలి. కనుక అతడు సమూవేలుతో నాయనా ఆ స్వరం నీకు మల్లా విన్పిస్తే "అయ్యా! నీ దాసుడ్డి సెలవీయి. నేను నీవు చెప్పినట్లే చేస్తాను అని పల్కు ఆ స్వరం నీతో చెప్పిన సందేశాన్నితెల్లవారిన తర్వాత నాకు తెలియజేయి" అని బోధించాడు.
ప్రభువు రాత్రి దేవళంలో నాల్గవసారి సమూవేలూ అని పిల్చాడు. బాలుడు వెంటనే లేచి అయ్యా నీ దాసుణ్ణీ  సెలవీయి. నేను నీవు చెప్పినట్లే చేస్తాను అని పల్కాడు. దేవుడు అతనికి తన సందేశం విన్పించాడు. ఆ సందేశం ఇది. ఏలీ కుమారులిద్దరు పరమ దుర్మార్డులు. వాళ్ళు దేవళంలో చేసే ఆగడాల వల్ల దేవునికి అపకీర్తి కలుగుతూంది. ఏలీ వాళ్ళను అదుపులో పెట్టలేదు. కనుక ప్రభువు ఆ కుటుంబాన్ని సమూలంగా
                                                           148