పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీనికి భిన్నంగా వివాహ వ్యవస్థ ఈ లోకంలో క్రీస్తుకి తిరుసభతో వుండే ఐక్యతను సూచిస్తుంది. కనుక ఒకటి పరలోకంలోని ఐక్యతను సూచిస్తే, మరొకటి ఈలోకంలోని ఐక్యతను తెలియజేస్తుంది. గురు జీవితానికి వివాహ జీవితానికీ ఈ వ్యత్యాసం వుంది. గురుజీవితం తిరుసభలో దైవారాధనను కొనసాగించడానికి వుంది. గురువుకి అక్షయమైన ముద్రకూడ లభిస్తుంది. వివాహ జీవితంలో అక్షయమైన ముద్ర యేమీలేదు. భార్యాభర్తలు మాత్రం తమ జీవితకాలమంతా కలసిమెలసి జీవిస్తారు. వివాహ జీవితం బిడ్డలను కనడానికీ, ఆ బిడ్డలను తిరుసభ బిడ్డలనుగా తయారుచేయడానికీ వుంది. వారిని దైవప్రజలనుగాను దేవుని కుటుంబ సభ్యులనుగాను చేయడానికి వుంది. కనుక గురుజీవితం దైవరాధనకొరకు, వివాహజీవితం మానవజాతి మనుగడను ఈ భూమిపై కొనసాగించడం కొరకు.

3. వివాహ జీవితానికి పిలుపు

ఎవరైనా వివాహ అంతస్తులో ప్రవేశించవచ్చు. "మీరు పెక్కండ్రు బిడ్డలను కని వృద్ధిచెందండి" అన్న తొలి ఆజ్ఞను దేవుడు నరులందరికీ యిచ్చాడు - ఆది 1,28. ఐతే దేవుడు వివాహము అంతస్తుకిపిల్చే నరుని హృదయంలో ఆ వివాహంపై బలమైన కోరిక పుట్టిస్తాడు. అతన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితులద్వారా, కొందరు ప్రత్యేక వ్యక్తులద్వారా ఓ నిర్ణీతవ్యక్తిదగ్గరికి నడిపిస్తాడు. చివరన వాళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది. వివాహపు అంతస్తులో ప్రవేశించకముందు స్త్రీపురుషులు తమ హృదయంలోని కోరికలను పరిశీలించి చూచుకోవాలి. దేవుని చిత్తాన్ని గుర్తించాలి. ఆ దేవుడు తనకు నిర్ణయింపబోయే భాగస్వామిని పెద్దలు మిత్రులు మొదలైనవారి సహాయంతో గుర్తుపట్టాలి. ఈలా గుర్తుపట్టటానికి మన తరపున మనకు ప్రార్థన ఆలోచన రెండూ అవసరమే. గురువులను మఠకన్యలనులాగే వివాహితులనుగూడ ప్రభువు ఓ ప్రత్యేక పద్ధతిలో పిలుస్తాడు. ఒక ప్రత్యేక పురుషుణ్ణి ఒక ప్రత్యేక స్త్రీతో జతగూరుస్తాడు. అందరి వివాహాలను ముందుగా నిర్ణయించేది ఆ ప్రభువే.

4. వివాహజీవితమూ పావిత్ర్యమూ

వివాహజీవితం గడిపేవాళ్ళుకూడ పవిత్రంగా జీవిస్తారని చెప్పాం. కాని వివాహితుల ప్లావిత్ర్యం వేరు. గురువూ మఠకన్యా ఈలోక విషయాలలోగాక పరలోక విషయాల్లో నిమగ్నులై యుండాలి. వాళ్ళది ప్రధానగా నివృత్తిమార్గం. అనగా లౌకిక విషయాలనుండి వైదొలగడం. ఈలాకాక వివాహితులు ఈలోక విషయాల్లో నిమగ్నులౌతుండాలి. భూమండలమంతట వ్యాపించి దాన్ని వశపర్చుకోండి అన్న వేదవాక్యం