పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిరుసభలో పలురకాల జీవిత విధానాలు వున్నాయి, వీటన్నిటిని నియమించిన వాడు ప్రభువే. వివాహ వ్యవస్థ కూడ ఓ జీవిత విధానం. దాన్ని ఏర్పరచినవాడు క్రీస్తే, కనుక అదికూడ ఓ పిలుపే. వివాహ వ్యస్థ ఓ దేవద్రవ్యానుమానంచే పరిపూరితమైంది. అది తిరుసభలో క్రీస్తు ద్వారా నూత్నజీవాన్ని కొనివస్తుంది. ఈ వ్యవస్థను చేపట్టే భార్యాభర్తలు ప్రత్యేకమైన పద్ధతిలో పవిత్రులు కావాలి.

భగవంతుడు అందరినీ గురు కన్యాజీవితాలకు పిలువడు. చాలమందిని వివాహ జీవితాలకే పిలుస్తుంటాడు. క్రైస్తవుల్లో నూటికి 99శాతం వివాహితులేగదా! ఈ వివాహ వ్యవస్థను బైబులు పలుతావుల్లో వర్ణిస్తుంది. “దేవుడు తన్ను పోలునట్లుగా మానవజాతిని సృజించాడు. స్త్రీపురుషులనుగా మానవులను చేసాడు. వారిని దీవించి మీరు బిడ్డలను పెక్కండ్రను కని వృద్ధిజెందండని చెప్పాడు" - ఆది 127-28. "మా పితరులు దేవుడవైన ప్రభూ! నీకు సుతి కలుగునుగాక నీవు ఆదామును సృజించావు. అతనికి భార్యగాను, ఆదరవుగాను, తోడుగాను ఉండడానికి ఏవను చేసావు. వారినుండి మానవజాతి ఉద్భవించింది” తోబీతు 6,5–6. "ప్రారంభంనుండి సృష్టికర్త భార్యాభర్తలను స్త్రీ పురుషలనుగా సృజించాడు. ఈ కారణంచేత పురుషుడు తల్లిదండ్రులను విడనాడి భార్యను హత్తుకుని వుంటాడు. వాళ్ళిద్దరూ ఏకశరీరులై యుంటారు - మత్త 19,4-5.

వాటికన్ మహాసభ ఈలా బోధించింది. భార్యాభర్తలు క్రీస్తుకీ తిరుసభకూ గల ఐక్యతను ప్రేమను జ్ఞప్తికి తెస్తుంటారు. వాళ్లు పరస్పర ప్రేమతో కలసిమెలసి జీనించడం ద్వారాను, బిడ్డలను కనిపెంచడంద్వారాను పవిత్రులౌతారు. తిరుసభలో వాళ్ళకు ఓ ప్రత్యేకస్థానం వుంది.

వివాహ వ్యవస్థకూడ ఓ ప్రత్యేక పిలుపు అనడానికి ప్రధాన కారణం ఇది. దేవుడు తిరుసభలో కొందరు నరులకు ఓ ప్రత్యేకమైన పని ఒప్పజెప్తాడు. ఆ పని సక్రమంగా జరగడానికిగాను ఓ ప్రత్యేక దేవద్రవ్యానుమానమూ వరప్రసాదమూ వారికి తోడ్పడేలా చేస్తాడు. మనం ఆ నరులు దేవునినుండి ప్రత్యేకమైన పిలుపుని పొందారని చెప్తాం. ఐతే వివాహ వ్యవస్థలో జ్ఞానస్నానం పొందిన స్త్రీ పురుషులిద్దరికీ దేవుడు ప్రత్యేకమైన పనిని ఒప్పజెప్తాడు. ఆపని క్రీస్తు తిరుసభల ఐక్యతను సూచించడం, సంతానాన్నికని మానవజాతిని అభివృద్ధిచేయడం. ఈ పనిని సాధించడానికిగాను వివాహ దేవద్రవ్యానుమానమూ ప్రత్యేక వరప్రసాదమూ, వాళ్ళకు సాయంజేస్తూంటాయి. కనుక వివాహ వ్యవస్థకూడ ప్రత్యేకమైన పిలుపే.

2. వివాహ జీవితమూ బ్రహ్మచర్య జీవితమూ

గురువులు మఠకన్యలు గడిపే బ్రహ్మచర్య జీవితానికి ప్రత్యేకమైన విలువ వుంది. ఈలాంటి జీవితం మోక్షంలో మనకు భగవంతునితో సిద్ధించే ఐక్యతను సూచిస్తుంది.