పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. దివ్యభోజనం

పునీత అగస్టీను తాను వ్రాసిన "కన్ఫెషన్సు" అనే గ్రంథంలో ఓ సంఘటనం చెప్పాడు. అగస్టీను యౌవనప్రాయంలో చాల పాడుజీవితం జీవించి ఆ పిమ్మట పరివర్తనం చెందాడు. కాని పరివర్తనం చెందాకకూడ అశుద్ధపు కోరికలు అతన్ని నిత్యమూ బాధిస్తుండేవి. ఓదినం అగస్టీను ఈ విషయాన్ని ప్రభుసన్నిధిలో నివేదించుకొని ప్రార్ధనం చేసికొంటూండగా అతని అంతరాత్మలో ఓస్వరం వినిపించింది. "నీవు నా శరీరాన్ని చేకొని భుజించు, నీ బాధలు తీరిపోతాయి. కాని ఈ భోజనం మాత్రం నరులను నా లోనికి మారుస్తుంది" అని ప్రభువు అతనితో సెలవిచ్చాడు. తరువాత అగస్టీను దివ్యభోజనాన్ని యోగ్యంగా స్వీకరించి ఆ యశుద్ధపు కోరికలను అరికట్టగల్లానని తన గ్రంథంలో వ్రాసికొన్నాడు. జీవితంలో కష్టాలను ఎదుర్కొనేపుడు మనంకూడ సంస్కారాలద్వారా, విశేషంగా దివ్యభోజన సంస్కారంద్వారా, ఈ శక్తినే పొందవచ్చు. కనుక దంపతులు క్రైస్తవ సంస్కారాలను యోగ్యంగా స్వీకరించి తమ జీవితాన్ని భక్తిమంతంగాను శక్తిమంతంగాను తీర్చిదిద్దుకోవాలి.

4 అక్విలా, ప్రిస్కా

పౌలు క్రీస్తును బోధించడంకోసం కోరింతు పట్టణానికి వచ్చాడు. ఆ నగరంలో అక్విలా, ప్రిస్కా అనే యూద క్రైస్తవ దంపతులు వుండేవాళ్ళు వాళ్లు గుడారపు బట్టలు నేసికొని జీవిస్తుండేవాళ్లు. పౌలు కోరింతులో వున్నంతకాలం ఈ దంపతుల ఇంటిలోనే తలదాచుకున్నాడు. వీళ్ళతోపాటు తానూ గుడారాల బట్టలు నేసాడు. ఈ దంపతులు పౌలునుండి క్రీస్తును నేర్చుకున్నారు. తాము నేర్చుకున్న క్రీస్తును ఇతరులకు బోధించారు. తమ బోధలద్వారానైతేనేం, తాము జీవించే ఆదర్శ క్రైస్తవ జీవితంద్వారానైతేనేం క్రీస్తునకు సాక్ష్యమిచ్చారు. పౌలు తనజాబుల్లో ఈ దంపతులను ఎంతో ఆదరపురస్కారాలతో పేర్కొన్నాడు - రోము 16,3-4. ఈలాగే మన క్రైస్తవ దంపతులుకూడ భక్తిమంతమైన జీవితంద్వారా క్రీస్తునకు సాక్ష్యమిస్తుండాలి.

10. వివాహ జీవితంగూడ పిలుపే

1. వివాహ జీవితంగూడ పిలుపే

మామూలుగా మనం గురుజీవితం, కన్యాజీవితం దేవుని పిలుపు అనుకొంటాం. కాని వివాహ జీవితంగూడ దేవునిపిలుపే. అసలు దైవప్రజలందరికి పిలుపు వుంటుంది. ఆ పిలుపులో అంతర్భాగాలే గురుజీవితం, వివాహజీవితం మొదలైనవి. వివాహితులుకూడ పవిత్రజీవనం గడపాలి. వివాహ అంతస్తుకి తిరుసభలో ప్రత్యేకమైనస్థానం వుంది.